AP-Telangana: తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్‌లో రూ.12,800 కోట్లు: అశ్విని వైష్ణవ్‌

తెలంగాణలోని ప్రాజెక్టులకు రూ.4,418 కోట్లు, ఏపీలోని రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.8,406 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు.

Updated : 03 Feb 2023 20:38 IST

హైదరాబాద్‌: బడ్జెట్‌లో రైల్వే విభాగంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.12,800 కోట్లు కేటాయించినట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. ఇందులో రూ.4,418 కోట్లు తెలంగాణలోని ప్రాజెక్టుల కోసం, రూ.8,406 కోట్లు ఏపీలోని రైల్వే ప్రాజెక్టుల కోసం కేటాయించినట్టు వెల్లడించారు. 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.886 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని గుర్తు చేశారు. బడ్జెట్‌లో తెలంంగాణకు భారీగా కేటాయింపులు జరిగాయని, చాలా చోట్ల అండర్‌ పాస్‌లు, రైల్వే బ్రిడ్జిల నిర్మాణం జరుగుతోందన్నారు. వీటిలో డబ్లింగ్‌, ట్రిపులింగ్‌ చేసే ప్రాజెక్టులు కూడా ఉన్నాయన్నారు. రైల్వే స్టేషన్లలో రోజు వారీ సరకులు కూడా ప్రయాణికులకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

సికింద్రాబాద్‌-విశాఖపట్నం వందేభారత్‌ రైలుకు మంచి స్పందన వస్తోందని రైల్వే మంత్రి తెలిపారు. త్వరలో వందే మెట్రోలు కూడా రాబోతున్నాయని వెల్లడించారు. 60-70 కి.మీ ఉన్న రెండు పట్టణాల మధ్య వందే మెట్రో నడుస్తుందని, వందే భారత్‌ రైలుకు భిన్నంగా ఇది ఉంటుందన్నారు. ప్రయోగాత్మకంగా పరిశీలించిన తర్వాతే వందే మెట్రోను ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. 2017లో ప్రధాని మోదీ వందే భారత్‌ రైలును సూచించారని, అనేక సార్లు పరీక్షించిన తర్వాతే వందే భారత్‌ రైళ్ల తయారీ ప్రారంభమైందన్నారు. రైల్వే ప్రాజెక్టుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కోరుతున్నామన్నారు. హై స్పీడ్‌ రైళ్లపై అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. కాజీపేటలో వ్యాగన్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం టెండర్లు పిలిచామని, త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. కోచ్‌ ఫ్యాక్టరీలు ఇప్పటికే దేశంలో చాలా ఉన్నాయన్న అశ్విని వైష్ణవ్‌.. విభజన చట్టంలో కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఫీజుబులిటి పరిశీలించాల్సి ఉందన్నారు. తెలంగాణలో ఎంఎంటీఎస్‌కు రూ.600 కోట్లు కేటాయించామన్నారు. కేంద్రం చేయాల్సింది చేస్తుందని.. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని అశ్విని వైష్ణవ్‌ కోరారు. రానున్న రోజుల్లో మరిన్ని వందే భారత్‌ రైళ్లు రాబోతున్నాయన్నారు.

గత బడ్జెట్‌ కంటే తెలంగాణకు 45 శాతం పెంపు: దక్షిణమధ్య రైల్వే జీఎం

గత బడ్జెట్‌ కంటే ఈసారి రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు 45 శాతం బడ్జెట్‌ పెంచినట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆరుణ్‌ కుమార్‌ జైన్‌ వెల్లడించారు. రూ.600 కోట్లు నగరంలో డబ్లింగ్‌, త్రిబ్లింగ్‌ పనులకోసం కేటాయించారన్నారు. రూ.450 కోట్లు కాజిపేట- బల్లార్షా మార్గంలో థర్డ్‌ లైన్‌ పనులకోసం, అకొల- డోన్‌ మార్గంలో డబ్లింగ్ కోసం రూ.60 కోట్లు, కాజిపేట- విజయవాడ థర్డ్‌ లైన్‌ పనుల కోసం రూ.377 కోట్లు, బైపాస్‌ లైన్ల కోసం రూ.383.12 కోట్లు, చర్లపల్లి టెర్మినల్‌ పనుల కోసం రూ.82 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఎంఎంటీఎస్‌ రెండోదశ పనుల కోసం రూ.600 కోట్లు, రైల్వే స్టేషన్ల అభివృద్ధికోసం రూ.125 కోట్లు వెచ్చించినట్టు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు