Moonwalkers: పరుగులాంటి నడక కోసం.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బూట్లు!

పరుగులాంటి నడకను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా! దీన్ని సాధ్యం చేస్తూ.. అమెరికాకు చెందిన షిఫ్ట్‌ రోబోటిక్స్‌ సంస్థ ప్రత్యేక బూట్లను రూపొందించింది. వీటిని ధరించడం ద్వారా నడక వేగం దాదాపు 250 శాతం పెరుగుతుందని సంస్థ తెలిపింది.

Published : 29 Oct 2022 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పరుగులాంటి నడకను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా! దీన్ని సాధ్యం చేస్తూ.. అమెరికాకు చెందిన షిఫ్ట్‌ రోబోటిక్స్‌ సంస్థ ప్రత్యేక బూట్లను రూపొందించింది. వీటిని ధరించడం ద్వారా నడక వేగం దాదాపు 250 శాతం పెరుగుతుందని సంస్థ తెలిపింది. ‘మూన్‌వాకర్స్‌(Moonwalkers)’ పేరిట తయారు చేసిన ఈ బూట్లు.. స్కేటింగ్‌ షూల మాదిరే కనిపిస్తాయి. వీటికీ చిన్నపాటి చక్రాలుంటాయి. కృత్రిమ మేధ(AI), ప్రత్యేక అల్గారిథమ్‌, బ్యాటరీ సాయంతో ఇవి పనిచేస్తాయి. ఈ మూన్‌వాకర్‌లను వేర్వేరూ బూట్లకూ అమర్చుకునే వీలుంది. ఇవి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బూట్లు అని సంస్థ వ్యవస్థాపకుడు షుంజీ జాంగ్‌ వెల్లడించారు.

సెన్సార్‌ల ద్వారా ‘షూ’లలోని కృత్రిమ మేధ.. వాటిని ధరించిన వ్యక్తి నడకను పర్యవేక్షిస్తుంది. అతని నడక వేగం ఆధారంగా ప్రత్యేక అల్గారిథమ్‌.. చక్రాలకు అనుసంధానమై ఉన్న మోటార్‌ను నియంత్రిస్తుంది. మెట్లు ఎక్కే, దిగే సమయంలో చక్రాలు లాక్‌ అయ్యే సదుపాయం కూడా ఉంది. ప్రజల సగటు నడక వేగం గంటకు 4 నుంచి 6.4 కిలోమీటర్లుగా ఉంటుందనే విశ్లేషణను పరిగణనలోకి తీసుకుని.. మూన్‌వాకర్స్‌ ఈ వేగాన్ని 250 శాతం వరకు పెంచుతాయని సంస్థ తెలిపింది. వాటి ధర 1,399 డాలర్లు(రూ.1.15 లక్షలు)గా నిర్ణయించినట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది మార్చి నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని