Andhra News: ఆరోగ్యశ్రీలో కొత్తగా 809 చికిత్సలను చేర్చిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో కొత్తగా 809 చికిత్సలను చేర్చింది. దీంతో ప్రస్తుతం వీటి సంఖ్య 3,255కి చేరింది. వైద్యఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు.

Published : 29 Oct 2022 01:37 IST

అమరావతి: ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో కొత్తగా 809 చికిత్సలను చేర్చింది. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ కింద 2,446 చికిత్సలు ఉండగా.. తాజాగా వీటి సంఖ్య 3,255కి చేరింది.   వైద్య ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామన్న సీఎం.. ఎక్కడా బకాయిలు లేకుండా చూస్తున్నట్టు తెలిపారు. దీనివల్ల ఎంపానెల్డ్ ఆసుపత్రుల్లో నమ్మకం, విశ్వాసం కలిగిందన్నారు. రోగులకు మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు చెప్పారు.  వైద్య ఆరోగ్యశాఖలో అనేక సంస్కరణలు, మార్పులు తీసుకువచ్చినట్టు సీఎం తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో పెంచిన వైద్య చికిత్సల కారణంగా ఏడాదికయ్యే ఖర్చు రూ.2,894.87 కోట్లు, ఆరోగ్య ఆసరా కోసం మరో రూ.300 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు.

ఆరోగ్యశ్రీ కార్డుల్లో ప్రతి ఒక్కరి హెల్త్‌ హిస్టరీని రికార్డుల్లో నిక్షిప్తం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. దీనివల్ల ఫ్యామిలీ డాక్టర్‌ రోగులకు సరైన వైద్య సేవలు అందించగలుగుతారన్నారు. నిరంతరం ఈ రికార్డులను అప్‌డేట్‌ చేసుకుంటూ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తెలుసుకునేలా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు గాయపడితే అలాంటి వారికి వెంటనే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించాలని సీఎం ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖలో ఫేస్‌ రికగ్నైజేషన్‌ హాజరును తప్పనిసరి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో మందుల సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని