CM Jagan: రాష్ట్రంలో గతంతో పోలిస్తే మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి: సీఎం జగన్‌

రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, అమ్మకాలపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.

Updated : 15 Nov 2022 06:23 IST

అమరావతి: రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, అమ్మకాలపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. గంజాయి, అక్రమ మద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వాణిజ్య పన్ను చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ఆదాయాలను ఇచ్చే శాఖలపై సీఎం జగన్‌ ఇవాళ సమీక్షించారు. తొలుత వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమీక్షించిన సీఎం ఆ శాఖ ప్రగతిపై ఆరా తీశారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పన్ను చెల్లింపుదారులకు మరింత అవగాహన కల్పించాలన్నారు. చెల్లింపుల ప్రక్రియను మరింత సౌలభ్యంగా చేయాలని సూచించారు. అవగాహన పెంచుతూనే వారి అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. దీనివల్ల చెల్లింపులు సకాలంలో జరుగుతాయని, పన్ను కట్టేవారికి కూడా చక్కటి సేవలు అందించినట్లవుతుందని చెప్పారు. ట్రేడ్‌ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. 

మద్యం అమ్మకాలు తగ్గాయి.. 

ఎక్సైజ్ శాఖపై సమీక్షించిన సీఎం జగన్‌.. గతంతో పోలిస్తే మద్యం అమ్మకాలు తగ్గాయన్నారు. బెల్టుషాపులు తొలగించడం, పర్మిట్‌ రూమ్‌లు రద్దు చేయడం వంటి వివిధ రకాల నియంత్రణ చర్యల వల్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. రేట్లు పెంచడం వల్ల కూడా మద్యం వినియోగం తగ్గిందన్నారు. మద్య అక్రమ రవాణాను నివారించడానికి తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఏజెన్సీలో గంజాయి నివారణ చర్యలు చేస్తూనే... అక్కడ కూడా ఉపాధి మార్గాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. వారికి ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు ఉన్నాయో లేదో తనిఖీ చేసి, లేకపోతే అర్హులైన వారికి పట్టాలివ్వాలని ఆదేశించారు. పట్టాలు వచ్చిన రైతులకు తద్వారా రైతు భరోసా కూడా లభిస్తుందన్నారు. అప్పుడే ఆశించిన స్థాయిలో మార్పు వస్తుందన్నారు. 

రిజిస్ట్రేషన్‌ శాఖపైనా సమీక్షించిన సీఎం.. శాశ్వత భూహక్కు, భూసర్వే కార్యక్రమం చేపడుతున్న గ్రామాలు, వార్డుల్లో సబ్‌ రిజిస్ట్రార్‌ భవనం, సేవలు వంటి వాటిపై అవగాహన కలిగించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఈ దిశగా ఓరియెంటేషన్‌ అందించాలన్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను అప్‌గ్రేడ్‌ చేయాలని ఆదేశించారు. మైనింగ్‌ శాఖపై సమీక్షిస్తూ.. నాన్‌ ఆపరేషనల్‌ మైన్స్‌పై మరింత దృష్టి పెట్టాలన్నారు. నిరుపయోగంగా ఉన్న మైనింగ్‌ ఏరియాలో కార్యకలాపాలు మొదలయ్యేలా చూడాలని అధికారులకు సీఎం జగన్‌ నిర్దేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని