AP High Court: అమరావతిపై తీర్పు.. స్టేటస్‌ రిపోర్టు ఇవ్వండి: హైకోర్టు ఆదేశం

రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పు అమలు చేయట్లేదని రైతులు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated : 05 May 2022 11:46 IST

అమరావతి: రాజధాని అమరావతిపై హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ ఆ ప్రాంత రైతులు ఉన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఉద్దేశపూర్వకంగానే తీర్పును అమలు చేయట్లేదని రైతులు అందులో పేర్కొన్నారు. నిధులు లేవనే సాకుతో రాజధాని తీర్పు అమలులో జాప్యం చేస్తున్నారని రైతుల తరఫు న్యాయవాది ఉన్నం మురళీధర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. అమరావతిపై స్టేటస్‌ రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జులై 12కు వాయిదా వేసింది.

నేపథ్యమిదీ..

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ సీఆర్‌డీఏ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ (మూడు రాజధానులు) చట్టాలను సవాలు చేస్తూ రాజధాని రైతులతో పాటు పలువురు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు మార్చిలో తుదితీర్పు వెలువరించింది. ‘‘అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని మూడు నెలల్లోపు వాటాదారులకు ప్లాట్లు నిర్ణయించాలి. ఆరునెలల్లోపు ప్లాట్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లు అమలు చేయాలి. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదు. లేని అధికారాలతో చట్టాన్ని రద్దు చేయలేరు. అధికారం లేనప్పుడు సీఆర్డీఏ చట్టం రద్దు కుదరదు. అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదు. పిటిషనర్లందరికీ ఖర్చుల కింద రూ.50వేలు చెల్లించాలి’’ అని హైకోర్టు ధర్మాసనం పేర్కొన్న విషయం తెలిసిందే.

హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వైకాపా ప్రభుత్వం పాటించడం లేదని రాజధాని రైతులు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేయగా.. తాజాగా విచారణ చేపట్టిన ధర్మాసనం స్టేటస్‌ రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని