AP Constable posts: ఫిజికల్‌ ఈవెంట్స్‌ వాయిదా.. కారణమిదే..

ఏపీలో పోలీసు కానిస్టేబుల్‌ ఫిజికల్‌ ఈవెంట్స్‌(AP police constable Physical Events) వాయిదా పడ్డాయి.  కొత్త తేదీలను తర్వాత వెల్లడించనున్నట్టు పోలీస్‌ నియామక మండలి తెలిపింది.

Updated : 10 Mar 2023 17:35 IST

అమరావతి: ఏపీలో 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల(AP Constable posts) భర్తీ కోసం ఈ నెల 14 నుంచి జరగాల్సిన ఫిజికల్‌ ఈవెంట్స్‌(పీఎంటీ/పీఈటీ) వాయిదా పడ్డాయి.  అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఈవెంట్స్‌ను వాయిదా వేస్తున్నట్టు పోలీస్‌ నియామక మండలి ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త తేదీలను తర్వాత ప్రకటించనున్నట్టు వెల్లడించింది. అభ్యర్థులకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. తాజా అప్‌డేట్స్‌ కోసం తమ వెబ్‌సైట్‌ను చెక్‌ చేసుకోవాలని రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌ మనీశ్‌ కుమార్‌ సిన్హా విజ్ఞప్తి చేశారు. మరోవైపు, ప్రిలిమ్స్‌ పరీక్షలో అర్హత సాధించి ఫేజ్‌-2 పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫిజికల్‌ ఈవెంట్స్‌కు హాజరయ్యేందుకు ఇటీవలే హాల్‌ టిక్కెట్లను వెబ్‌సైట్‌లో ఉంచిన విషయం తెలిసిందే.

ఒక్కో పోస్టుకు 16 మంది పోటీ..

జనవరి 22న ప్రాథమిక పరీక్ష (ప్రిలిమ్స్‌) జరగ్గా 4,59,182 మంది హాజరయ్యారు. వీరిలో 95,209 మంది (20.73%) మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో పోస్టుకు 16 మంది పోటీపడుతున్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 95,209 మందికి త్వరలో దేహదారుఢ్య పరీక్షలు (పీఎంటీ, పీఈటీ) నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారంతా స్టేజ్‌-2 పరీక్షల కోసం ఫిబ్రవరి 13 నుంచి 20 వరకూ పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే, దేహదారుఢ్య పరీక్షల సమయంలోనే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కూడా ఉంటుంది. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన వారిలో 77,876 మంది పురుషులు కాగా, 17,332 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా  ఈ పరీక్షను 4లక్షల మందికి పైగా అభ్యర్థులు రాసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని