Ap News: ఆసరా కోసం ఆశగా..

తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురంలోని ఎస్సీపేటకు చెందిన దుర్గ, శివ దంపతులకు అభిషేక్ తొలి సంతానం. అయితే పుట్టినప్పటినుంచి అభిషేక్‌ మిగతా పిల్లల్లా ఎదగలేదు. ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది....

Published : 09 Jul 2021 23:58 IST

సిరిపురం: బుడిబుడి అడుగులు వేయడం మొదలు.. పిల్లలు ఏం చేసినా తల్లిదండ్రులు అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటారు. కానీ, పుట్టినప్పటి నుంచే బిడ్డ అచేతనంగా ఉంటే వారికది అంతులేని వేదన. నట్టింట నరకం. నిలబడలేడు.. మాట్లాడలేడు.. కళ్లు పూర్తిగా తెరిచి చూడలేడు. పన్నెండేళ్లుగా మంచానికే పరిమితమైన కుమారుడి కష్టాన్ని తీర్చలేని తల్లిదండ్రుల దీనగాథ ఇది.

తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురంలోని ఎస్సీపేటకు చెందిన దుర్గ, శివ దంపతులకు అభిషేక్ తొలి సంతానం. అయితే పుట్టినప్పటి నుంచి అభిషేక్‌ మిగతా పిల్లల్లా ఎదగలేదు. ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. సకల సపర్యలు చేస్తూ కుమారుడి తల్లి తల్లడిల్లుతోంది. అభిషేక్‌కు తరచూ ఫిట్స్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. శివ కాంక్రీట్‌ ట్యాంకర్‌ హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన అంతంతమాత్రం ఆదాయమే వారి జీవనాధారం. కరోనా వీరి కష్టాలను రెట్టింపు చేసింది. 

అభిషేక్‌కు దివ్యాంగ పింఛను కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం శూన్యం. పింఛను మంజూరుకు వేలి ముద్రలు, ఐరిస్‌ నమోదు తప్పనిసరి కాగా అవి నమోదు కావడం లేదు. ఆర్థికంగా బతుకుబండిని లాగలేకపోతున్నామని ఆ తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇరుగుపొరుగు వారు బాలుడి కుటుంబానికి వీలైనంత సాయం చేస్తున్నా.. అది చాలడంలేదని కంటతడి పెడుతున్నారు. దంపతులు, ఇద్దరు పిల్లలతో పాటు ఓ వృద్ధురాలు అదే ఇంట్లో నివసిస్తున్నారు. కుటుంబ భారం తగ్గించే దాతల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని