TS Election: చురుగ్గా ఏర్పాట్లు.. తెలంగాణలో షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు?

అక్టోబరులో 3, 4, 5 తేదీల్లో రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం రానుందని రాష్ట్ర  ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌ రాజ్‌ తెలిపారు.

Updated : 23 Sep 2023 16:39 IST

హైదరాబాద్‌: ఎన్నికల ప్రక్రియలో వేగం పెరిగిందని, అందుకు అవసరమైన అన్నిచర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(CEO) వికాస్‌ రాజ్‌ తెలిపారు. 24, 25 తేదీల నుంచి సమ్మరి రివిజన్‌ ప్రారంభమైందని, అది కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే ఈవీఎంలన్నింటినీ చెక్‌ చేశామని, అధికారుల శిక్షణ కోసం ఈవీఎంలను తెప్పించామని చెప్పారు. బీఆర్‌కే భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను సీఈవో వికాస్‌రాజ్‌ ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

వచ్చే నెలలో ఎన్నికలకు అవసరమైన డిస్టిబ్యూషన్‌ కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల వంటివి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులను గుర్తించడం, వారికి శిక్షణ ఇవ్వడం, పోలింగ్ స్టేషన్లు పరిశీలించి ఈసీఐ సూచనల ప్రకారం ఆయా ప్రాంతాల్లో కనీస మౌలిక సౌకర్యాలు ఉన్నాయా? లేదా వంటివి పరిశీలించి లేకుంటే సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.  కౌంటింగ్ కేంద్రాలను గుర్తించడంతో పాటు, కేంద్ర బలగాలకు వసతి, రవాణా సౌకర్యం, వారికి విధుల కేటాయింపు వంటిపై అంశాలపై దృష్టిసారించామన్నారు. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్, ఈవీఎంల ర్యాండమైజేషన్ తదితర ఏర్పాట్లు, శిక్షణ కొనసాగుతున్నాయని తెలిపారు.

అక్టోబరులో రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం

అక్టోబరులో 3, 4, 5 తేదీల్లో రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం రానుందని వికాస్‌ రాజ్‌ తెలిపారు. కేంద్ర బృందం రాష్ట్రంలోని రాజకీయ నాయకులతో, సీఎస్‌, డీజీపీ, కలెక్టర్లతో సమావేశమవుతుందని వెల్లడించారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 15 లక్షల కొత్త ఓట్లు నమోదయ్యాయని, 3లక్షల ఓట్లు రద్దయ్యాయని తెలిపారు. ఫారం-6, 8లు 15వేలకు పైగా వచ్చాయన్నారు. ఓట్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోందని వికాస్‌రాజ్‌ వెల్లడించారు. 6.99 లక్షల మంది యువ ఓటర్లు నమోదు చేసుకున్నారని వివరించారు. ఎన్నికల ప్రక్రియలో వేగం పెరగడంతో షెడ్యూల్‌ ప్రకారమే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని