CM Jagan: అందుకే ఈ రెండు పథకాలకు ‘చదువు’ నిబంధన: సీఎం జగన్‌

జనవరి-మార్చి త్రైమాసికంలో వివాహం చేసుకుని, అర్హత పొందిన వారికి వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు సీఎం జగన్‌ ఆర్థిక సాయం విడుదల చేశారు.  తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం బటన్‌ నొక్కి నిధులు విడుదల చేశారు.

Updated : 05 May 2023 16:29 IST

అమరావతి: పేదరికం పోవాలంటే చదువు అనే ఓ దివ్యాస్త్రం అందరికీ అందుబాటులోకి రావాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలోని పేదల పిల్లలు బాగా చదువుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని సీఎం తెలిపారు. వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల నిధులను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం బటన్‌ నొక్కి విడుదల చేశారు. జనవరి-మార్చి త్రైమాసికంలో వివాహం చేసుకుని, అర్హత పొందిన వారికి ఆర్థిక సాయం విడుదల చేశారు. 12,132 మంది లబ్ధిదారులకు రూ.87.32 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు.

నిధుల విడుదల అనంతరం సీఎం మాట్లాడుతూ.. పేదలు తమ పిల్లలను కనీసం పదో తరగతి వరకైనా చదివిస్తారనే ఆలోచనతోనే వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు చదువు నిబంధన పెట్టామని ఈ సందర్భంగా చెప్పారు. ఉన్నత చదువులు చదివేందుకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన అమలు చేస్తూ డిగ్రీ వరకు చదువుకునేలా సదుపాయం కల్పించినట్లు తెలిపారు. సాయం పొందిన 12,132 జంటల్లో 5,929 జంటలు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పొందుతున్నట్లు సీఎం తెలిపారు. ప్రతి పేద కుటుంబం పేదరికం నుంచి బయటకు రావాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంచి జరగాలనే ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సీఎం తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని