CM Jagan: పాదయాత్రలో చేనేతల ఇబ్బందులు చూశా: సీఎం జగన్‌

చేనేతలు పడుతున్న ఇబ్బందులను పాదయాత్రలో చూశానని సీఎం జగన్‌ అన్నారు.

Updated : 10 Aug 2021 12:26 IST

అమరావతి: చేనేతలు పడుతున్న ఇబ్బందులను పాదయాత్రలో చూశానని సీఎం జగన్‌ అన్నారు. ప్రభుత్వానికి ఇబ్బందులున్నా చేనేతల కష్టాలు తీర్చేందుకే ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ కింద మూడో విడత ఆర్థిక సాయాన్ని సీఎం జగన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అర్హులై సొంత మగ్గం కలిగిన 80వేలకు పైగా చేనేత కార్మికులకు రూ.24వేలు చొప్పున రూ.192 కోట్ల ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు. మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ఈ డబ్బు ఉపయోగపడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఐదేళ్లలో రూ.వెయ్యికోట్లు నేతన్న నేస్తం ద్వారానే ఇస్తున్నామని.. నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తున్నామన్నారు. ఐదేళ్లలో ఒక్కో చేనేత కుటుంబానికి రూ.1.20లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు సీఎం వివరించారు. 

అందకపోతే ఆందోళన వద్దు.. దరఖాస్తు చేసుకోండి

ఎవరికైనా నేతన్న నేస్తం అందకపోతే ఆందోళన చెందొద్దని జగన్‌ సూచించారు. ఇప్పటికీ గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు గడువును నెలరోజులు పెంచుతామని.. విచారణ చేపట్టి అర్హులైతే వెంటనే లబ్ధి చేకూరుస్తామని చెప్పారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత సహకార సంఘాలకు గత ప్రభుత్వం బకాయి పడిన రూ.103 కోట్లు చెల్లించామన్నారు. ఆప్కో ద్వారా వస్త్రాల సేకరణ, విద్యార్థుల యూనిఫాంలు సహా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీఎం వివరించారు. సంక్షేమ పథకాలు కాకుండా నేతన్నల అభివృద్ధి కోసం రూ.1500 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.259 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. ఎన్నికలు అయిపోగానే మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు చేస్తున్నామని జగన్‌ అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని