IND vs AUS: ప్రతి వ్యక్తి కదలికలపైనా నిఘా.. మొబైల్స్ తీసుకెళ్లొచ్చు: సీపీ మహేశ్‌ భగవత్‌

ఉప్పల్‌ స్టేడియంలో ఈనెల 25న జరిగే భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌కు సంబంధించి భద్రతాపరంగా

Updated : 23 Sep 2022 18:00 IST

హైదరాబాద్‌: ఉప్పల్‌ స్టేడియంలో ఈనెల 25న జరిగే భారత్‌-ఆసీస్‌ మ్యాచ్‌కు సంబంధించి భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు చేశామని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. మ్యాచ్ ఏర్పాట్ల వివరాలపై ఉప్పల్‌ స్టేడియంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘‘దాదాపు మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌ వీక్షించడానికి దాదాపు 40వేల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. ప్రేక్షకుల భద్రత నిమిత్తం 2500 మంది పోలీస్‌ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు క్రీడాకారులు వస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీతో పాటు ఆటగాళ్లకు భద్రత కల్పిస్తాం. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఏర్పాట్లు చేస్తున్నాం. మ్యాచ్‌ రోజున రాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీని కూడా కోరాం. 300 సీసీటీవీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్నాం. మైదానంలో కూర్చున్న ప్రతి వ్యక్తి కదలికలను సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తాం.

సెల్‌ఫోన్స్‌, బ్లూటూత్‌ హెడ్‌సెట్‌ తీసుకెళ్లొచ్చు..

మ్యాచ్‌ను చూడటానికి వచ్చే అభిమానులకు మైదానంలోకి మొబైల్, బ్లూటూత్‌ హెడ్‌సెట్‌ అనుమతి ఉంది. వీడియో కెమెరా, ల్యాప్‌టాప్, సిగరెట్స్, లైటర్లు, కత్తులు, బ్లేడ్లు, మద్యం, నీళ్ల బాటిల్స్, హెల్మెట్, ఫైర్ క్రాకర్స్, బ్యాగ్స్, హెల్మెట్స్‌, సెల్ఫీ స్టిక్స్, మాదక ద్రవ్యాలు వంటివాటికి అనుమతి లేదు. ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వాహనదారుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలం కేటాయిస్తాం. సాయంత్రం 4 గంటల నుంచి క్రికెట్ అభిమానులను స్టేడియం లోపలికి అనుమతిస్తాం. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. జేబు దొంగల కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. మైదానంలో సదుపాయాలను సైతం పరిశీలించాం. అగ్నిమాపక, మెడికల్ సిబ్బందితో పాటు ఏడు అంబులెన్సులు అందుబాటులో ఉంటాయి. స్నేక్ క్యాచర్స్‌ను సైతం అందుబాటులో ఉంచుతాం’’ అని సీపీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని