Delta Variant: ‘డెల్టా’ బాధితుల్లో 300 రెట్లు అధికంగా వైరల్ లోడ్‌

కరోనా వైరస్‌ వ్యాప్తి, వాటి జన్యు పరిణామక్రమాలపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా దక్షిణ కొరియాకు చెందిన ఓ అధ్యయనంలో డెల్టా వేరియంట్‌.......

Updated : 25 Aug 2021 05:55 IST

ఓ అధ్యయనంలో వెల్లడి

సియోల్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి, వాటి జన్యు పరిణామక్రమాలపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా దక్షిణ కొరియాకు చెందిన ఓ అధ్యయనంలో డెల్టా వేరియంట్‌ విషయంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మొదటి రకం కొవిడ్‌తో పోల్చితే డెల్టా వేరియంట్‌ సోకినవారిలో ప్రాథమిక దశలో 300 రెట్లు అధికంగా వైరల్‌ లోడ్‌ ఉన్నట్టు తేలింది. అయితే.. రోజులు గడిచేకొద్ది ఈ లోడ్‌ తగ్గుతుందని పేర్కొన్నారు. వైరస్‌ సోకిన 10 రోజుల తర్వాత ఇతర వేరియంట్లలో ఉండే వైరల్‌ లోడ్‌ స్థాయికి చేరుకుంటుందని వెల్లడైంది.

డెల్టా వేరియంట్‌ సోకిన 1848 మంది, ఇతర వేరియంట్ల బారినపడ్డ 22,106 మందిలో వైరల్‌ లోడ్‌ను పోల్చుతూ.. కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ(కేడీసీఏ) ఈ అధ్యయనం చేపట్టింది. మంగళవారం ఈ అధ్యయనం వివరాలు వెల్లడించింది. అధిక వైరల్‌ లోడ్‌ కారణంగానే డెల్టా వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తోందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారి లీ సాంగ్‌ వాన్‌ తెలిపారు. కాకపోతే ఈ వైరల్‌ లోడ్‌  300 రెట్లు ఉన్నంత మాత్రన.. వ్యాప్తి కూడా అదే స్థాయిలో ఉండదని స్పష్టం చేశారు.

మొదటి రకం కొవిడ్‌ కంటే రెండు రెట్లు, ఆల్ఫా వేరియంట్‌తో పోల్చితే 1.6 రెట్లు ఎక్కువగా వ్యాప్తి ఉంటుందని పేర్కొన్నారు. డెల్టా వేరియంట్‌ కట్టడి కోసం.. కొవిడ్‌ లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, వెంటనే ఐసొలేషన్‌కు వెళ్లి తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని