Shashi Tharoor: శశిథరూర్‌ సినిమాల్లో నటించారా?ఆ బాలనటుడు ఆయనేనా?

పై చిత్రంలో కుర్రాడు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌లా ఉన్నారు కదా? ఆయన చిన్నతనంలో సినిమాల్లో నటించారా? ఇంతకీ ఏ సినిమా?...

Published : 02 Apr 2022 11:56 IST

స్వయంగా క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్‌ ఎంపీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: పై చిత్రంలో కుర్రాడు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌లా ఉన్నారు కదా? ఆయన చిన్నతనంలో సినిమాల్లో నటించారా? ఇంతకీ ఏ సినిమా? అరే.. శశి థరూర్‌ అప్పుడు కూడా అదే హెయిర్‌స్టైల్‌, అదే సూట్‌ వేసుకునేవారా? అనిపిస్తుంది కదా! శుక్రవారం సోషల్‌ మీడియాలో ఇదే విషయంపై ఓ ఆసక్తికర చర్చ సాగింది. చాలా మంది ఆ ఫొటో చూడగానే ఆయన శశి థరూర్‌ అని నమ్మేశారు! అసలు విషయంలోకి వెళదాం..

ఈ ఫొటోను ప్రముఖ సినీ రచయిత వైభవ్ విశాల్‌ శుక్రవారం ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. థరూర్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించారని రాసుకొచ్చారు. హిందీ, మళయాళంలో కలిపి మొత్తం 9 చిత్రాల్లో నటించినట్లు చెప్పుకొచ్చారు. ఆయన స్క్రీన్‌ నేమ్‌ ‘మాస్టర్‌ జ్ఞాన్‌’ అని పేర్కొన్నారు. జైలర్‌ సినిమాలో గీతాబాలితో శశి కలిసి ఉన్న చిత్రాన్ని అటాచ్‌ చేస్తున్నానని తెలిపారు. దీన్ని తిరగేయడానికి ఇదే సరైన రోజు అంటూ.. శశి థరూర్‌ని తన పోస్ట్‌కి ట్యాగ్‌ చేశారు.

దీనిపై స్పందిన శశి థరూర్‌.. దీన్ని ఎప్పటికీ రహస్యంగా ఉంచుదామనుకున్నానని చమత్కరించారు. వైభవ్‌ చాలా లోతుగా పరిశోధించారని ప్రశంసించారు. ఇప్పటికీ తనను మాస్టర్ జ్ఞాన్‌గానే పిలుస్తున్నారని తెలిపారు. ఇదంతా శుక్రవారం సామాజిక మాధ్యమం ట్విటర్‌ వేదికగా జరిగిన సంభాషణ. ఎట్టకేలకు శశి థరూర్‌ అసలు విషయాన్ని శనివారం ఉదయం బహిర్గతం చేశారు. ఆ సంభాషణంతా ఓ జోక్‌ అని తెలిపారు. నిన్న ‘ఏప్రిల్‌ ఫూల్స్‌ డే’ సందర్భంగా వైభవ్‌ అలా ఆటపట్టించారని.. దాన్ని తాను మరింత సరదాగా మార్చానని చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని