కాంగ్రెస్‌ దారెటు!

సుదీర్ఘమైన చరిత్ర.. ఎన్నో ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన అనుభవం.. సీనియర్‌ నేతల ప్రాతినిథ్యం.. ఇవేమీ కాంగ్రెస్‌లోని సమస్యలను పరిష్కరించలేకపోతున్నాయి. వరుస ఓటములు, సవాళ్లతో కాంగ్రెస్‌ సతమతమవుతోంది. సరైన నాయకత్వం లేదన్న విమర్శలతో పాటు పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Updated : 29 Feb 2024 13:08 IST

సీనియర్ నేతల వ్యాఖ్యలతో అధిష్ఠానానికి చిక్కులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుదీర్ఘమైన చరిత్ర.. ఎన్నో ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన అనుభవం.. సీనియర్‌ నేతల ప్రాతినిథ్యం.. ఇవేమీ కాంగ్రెస్‌లోని సమస్యలను పరిష్కరించలేకపోతున్నాయి. వరుస ఓటములు, సవాళ్లతో కాంగ్రెస్‌ సతమతమవుతోంది. సరైన నాయకత్వం లేదన్న విమర్శలతో పాటు పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీనియర్‌ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ అధిష్ఠానంపై చేస్తున్న వ్యాఖ్యలు, అంతర్గత విభేదాలు ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. వరుస పరాజయాలు వారిలో పెంచుతున్న అసహనాన్ని సూచిస్తున్నాయి. ఇదిలాగే కొనసాగితే పార్టీకి భవిష్యత్తు ఉండదనే ఆందోళనను ప్రతిబింబిస్తున్నాయి. అందుకే చాలా మంది నేతలు అధిష్ఠానం వైఖరిపైనే అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. 
పార్టీలో అంతర్గత విభేదాలు


 

నాయకత్వం వహించడం అంత సులువేమి కాదు. ముఖ్యంగా రాజకీయాల్లో ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చాలి. ప్రజలకు చేరువయ్యే మార్గాలు అన్వేషించాలి. గెలుపోటములను సమానంగా తీసుకొని పార్టీని ముందుకు నడిపించాలి. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఇదే కరవైంది. ఫలితంగానే ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. ఎంతో ప్రాభవం ఉన్న పార్టీ ఇప్పుడు ఉనికి కాపాడుకోవడానికే తంటాలు పడుతోంది. అంతర్గత సమస్యలు, విభేదాలు, నేతల మధ్య సమన్వయం కొరవడటం, నాయకత్వం బలంగా లేకపోవడం కాంగ్రెస్‌ను ఇబ్బంది పెడుతున్నాయి. వరుస ఓటములతో పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది. ఇవి చాలవన్నట్లు మధ్యమధ్యలో సీనియర్‌ నేతల వ్యాఖ్యలు కాంగ్రెస్‌ ప్రతిష్ఠకు మరింత మచ్చ తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. బిహార్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మూటగట్టుకున్న ఘోర పరాభవం నేపథ్యంలో ఇటీవల కపిల్‌ సిబల్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను దేశ ప్రజలు ప్రత్యామ్నాయంగా భావించడం లేదని, పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందనడం చర్చలకు తావిస్తోంది. సమస్యలున్నాయని తెలిసినా ఎవరూ పరిష్కారం కోసం ముందుకు రావడం లేదని, ఇలాగే కొనసాగితే పార్టీ గ్రాఫ్‌ పడిపోతుందని అసహనం వ్యక్తం చేశారు కపిల్‌ సిబల్.  ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. సిబల్‌ వ్యాఖ్యలకు చిదంబరం తనయుడు, కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం మద్దతు పలికారు. పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ట్వీట్‌ చేశారు. 
అసంతృప్తి వ్యక్తం చేసిన చిదంబరం


 

కపిల్ సిబల్‌తో పాటు మరో సీనియర్‌ నేత పి.చిదంబరం పార్టీ వైఫల్యాలపై తనదైన రీతిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో సంస్థాగతమైన ఉనికిని కాంగ్రెస్‌ కోల్పోయిందనే విషయాన్ని ప్రస్తుత ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయని చిదంబరం అభిప్రాయపడ్డారు. బిహార్లో కాంగ్రెస్‌ తనకున్న బలానికి మించి ఎక్కువ సీట్లలో పోటీ చేసిందని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం పేర్కొన్నారు. గుజరాత్, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక ఉపఎన్నికల్లో వచ్చిన ఫలితాలు తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయని అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగతంగా ఉనికిని కోల్పోవడం లేదా గణనీయంగా బలహీనపడిందనడానికి ఇవి నిదర్శనమని చిదంబరం వ్యాఖ్యానించారు. ఇలా వరుసగా సీనియర్‌ నేతలు వ్యాఖ్యలు చేయడంపై పార్టీ గుర్రుగా ఉంది. ముఖ్యంగా సీడబ్ల్యూసీ పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కపిల్ సిబల్. సీడబ్ల్యూసీలో నామినేటెడ్‌ సభ్యులకు ప్రశ్నించే ధైర్యమే లేదనడం, వర్కింగ్‌ కమిటీకి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాలని డిమాండ్‌ చేయడం పార్టీలోని అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయన్న సంకేతాన్నిస్తోంది. కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యలను, ఆయన వైఖరిని సహచర నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలా వ్యవహరించే బదులు వేరే పార్టీ చూసుకోవాలని, లేదంటే కొత్త పార్టీ పెట్టుకోవాలని ఘాటుగా బదులిస్తున్నారు. కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యలను రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ కూడా ఖండించారు. నేతలు మీడియాకు ఎక్కడం ఆక్షేపణీయం అన్నారు. ఈ వైఖరి దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు. ఇప్పుడే కాదు ఎన్నో రోజులుగా సీనియర్‌ నేతలు పార్టీ అధినాయకత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. 
సంచలనం రేపిన లేఖ


 

ఈ ఏడాది ఆగస్టులో 23మంది కాంగ్రెస్‌ నేతలు పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాయడం అప్పట్లో సంచలనమైంది. సంస్థాగత సంస్కరణలు జరగాలని ఆ లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు. పార్టీ నాయకత్వానికి జవసత్వాలు నింపాలని, పార్టీ లోపాలు సూచిస్తూ నేతలు ఈ లేఖ రాశారు. వీరిలో గులాంనబీ ఆజాద్‌, ఆనంద్‌శర్మ, శశిథరూర్‌, కపిల్‌ సిబల్‌, మనీశ్‌ తివారీ, రాజ్‌ బబ్బర్‌, పృథ్వీరాజ్‌ చవాన్‌ తదితరులు ఉన్నారు. ఈ విషయమై అప్పట్లో పార్టీలోని పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో పార్టీ సంస్థాగత, కార్యనిర్వాహక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సోనియాగాంధీ ఓ అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు చేశారు. ఏకే ఆంటోని, అంబికా సోని, ముకుల్‌ వాస్నిక్‌, రణదీప్‌ సూర్జేవాలా ఈ కమిటీ సభ్యులుగా ఉన్నారు. అయినా ఎన్నికల వ్యూహాలు రచించడంపై వీరంతా దృష్టి సారించలేదని బిహార్‌ ఫలితాలే స్పష్టం చేస్తున్నాయి.
వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి 


 

అప్పుడు, ఇప్పుడు వినిపిస్తున్న మాట ఒక్కటే. పార్టీ ఆత్మ పరిశీలన ఆవశ్యకత. ఆ దిశగా అడుగులు పడుతున్న దాఖలాలు మాత్రం కాంగ్రెస్‌లో కనిపించడం లేదు. అందుకే కాంగ్రెస్‌కు వరుస పరాజయాలు తప్పడంలేదు. బిహార్‌ ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కేవలం 19 సీట్లలో కాంగ్రెస్‌ గెలిచింది. ప్రియాంకా గాంధీ ఇన్‌ఛార్జిగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 6 సీట్లకు ఉప ఎన్నికలు జరిగితే అన్నింటిలో ఓడిపోవడమే కాక 4 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు డిపాజిట్‌ కోల్పోయారు. కాంగ్రెస్‌ ప్రతిపక్షంగా ఉన్న గుజరాత్‌లో 8 సీట్లకు ఉపఎన్నికలు జరిగితే అన్ని స్థానాల్లోనూ ఆ పార్టీ పరాజయం పాలైంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు తిలోదకాలిచ్చి భాజపాతో చేతులు కలిపిన 25మందిలో 15 మంది భాజపా టికెట్‌పై పోటీ చేసి విజయం సాధించారు. బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో పరాజయంపై సమగ్ర సమీక్ష జరపాలని బిహార్‌ కాంగ్రెస్‌ నేతలు డిమాండ్ చేశారు. అభ్యర్థుల ఎంపికపైనా సమీక్షించాలని మరికొందరు కోరుతున్నారు. ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర పార్టీ నేతలు పలువురు రాజీనామాలకు సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వారిలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యుడిగా ఉన్న ఏఐసీసీ సభ్యుడు శక్తిసిన్హ్‌గోహిల్‌, పీసీసీ అధ్యక్షుడు మదన్‌మోహన్‌ ఝా, మరికొందరు రాజీనామా లేఖలను అధిష్ఠానానికి పంపించినట్లు తెలిసింది. ఈ పరిణామాలు చూస్తుంటే భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరిస్థితి ఎలా ఉంటుందన్నదే ప్రశ్నార్థకంగా మారింది. బిహార్‌ ఎన్నికల ఫలితాల ద్వారా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్‌ ముందుకు వస్తుందా అన్నది స్పష్టత లేదు.
గాంధీ కుటుంబం వెనకాడటంతోనే! 
2014 నుంచి కాంగ్రెస్‌ పరిస్థితి ఇంతే. ఎప్పుడైతే భాజపా అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కాంగ్రెస్‌ క్రమంగా ప్రాభవం కోల్పోతూ వచ్చింది. ప్రధాని మోదీ చరిష్మా, అమిత్‌షా వ్యూహాలతో ఎన్నికలు జరిగిన ప్రతిచోట భాజపా విజయ పతాకం ఎగురవేసింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ పూర్తిగా చతికిలపడింది. రాహుల్‌గాంధీ కాస్తోకూస్తో ప్రచారంలో పాల్గొంటూ పార్టీని ముందుండి నడుపుతారన్న నమ్మకం కలిగించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్‌తో మొదలుపెట్టి కొన్ని రాష్ట్రాల్లో మంచి ఫలితాలే అందుకున్నారు. అయితే ఈ ప్రస్థానం ఎంతో కాలం సాగలేదు. ఓట్లు, సీట్ల విషయంలో కొంత ఊరట లభించినా వాటిని అధికారానికి కావాల్సిన ఆధిక్యంగా మలుచుకోవడంలో కాంగ్రెస్‌ విఫలమైందన్న వాదనలున్నాయి. కాంగ్రెస్‌ను నడిపించాలంటే గాంధీ కుటుంబమే సరైందని పార్టీలో చాలా మంది నేతలు ఆకాంక్షిస్తున్నారు. కానీ వయోభారం కారణంగా సోనియా గాంధీ ఆ బాధ్యత నుంచి తప్పుకొని రాహుల్‌ గాంధీకి అప్పగించాలని భావిస్తున్నారు. రాహుల్‌ మాత్రం పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. గాంధీ కుటుంబమే పార్టీ వ్యవహారాలు చూసుకోవడానికి వెనకాడుతుండటం వల్లే ఈ అనిశ్చితి తలెత్తింది. అయితే రాహుల్‌ గాంధీ నాయకత్వం వహించిన సమయంలో సీనియర్లు అసంతృప్తితో రగిలిపోయారు. చాలా మంది తెరపైన కనిపించేవారే కాదు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సీనియర్ల గురించి మాట్లాడని రాహుల్‌ ఇప్పుడు వారి వ్యవహార శైలిని ప్రశ్నిస్తున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. సీనియర్‌ నాయకుల్లో అసహనానికి ఇదీ ఓ కారణమని పలువురు విశ్లేషిస్తున్నారు. రాహుల్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పార్టీ చీలిన నాటి నుంచి ఈ సమస్యలు మొదలయ్యాయని మరో విశ్లేషణ. రాహుల్‌ తమకు ప్రాధాన్యతనివ్వలేదనే అసంతృప్తి చాలా మంది సీనియర్లలో కనిపిస్తోంది. రాహుల్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీనియర్లు, జూనియర్ల మధ్య వ్యత్యాసాల కారణంగా పాత తరం నేతలు ఆయనకు సహకరించలేదని చాలా మంది చెప్పే మాట. సీనియర్ల ఆ తీరుతోనే ఇంతకాలంగా రాహుల్‌ వారిపై గుర్రుగా ఉన్నట్లు తరచూ వార్తలో కనిపిస్తూ వచ్చింది. వరుసగా ఓటమి పాలవుతున్నప్పటికీ ఎన్నికలపై సమీక్ష జరపడం, రాబోయే ఎన్నికలకు ఎలా సన్నద్ధమవాలో  ప్రణాళికలు రచించడం లాంటివి జరగడం లేదన్నది సీనియర్ల వాదన. అంటే పార్టీలో పూర్తిస్థాయిలో మార్పులను తీసుకొస్తే తప్ప మళ్లీ గట్టెక్కదని బాహటంగానే చెబుతున్నారు వారంతా. సోనియా గాంధీ క్షేత్రస్థాయి పరిస్థితులు పరిశీలించకపోవడం, రాహుల్‌ గాంధీ అంటిమట్టనట్లుగా వ్యవహరించడం పార్టీకి చేటు చేస్తోంది. కనీసం సీనియర్లకైనా ఆ బాధ్యతలు అప్పగిస్తారా అన్నది తేల్చడం లేదు. ఈ సందిగ్ధతే పార్టీ భవిష్యత్తును ప్రమాదంలో పడేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని