Kamareddy: పంచాయతీ ఆఫీసుకు రూ.11.41 కోట్ల విద్యుత్‌ బిల్లు.. కంగుతిన్న సర్పంచి

కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి జనవరి నెలకు సంబంధించి రూ.11,41,63,672ల విద్యుత్‌ బిల్లు రావడంతో సర్పంచి, కార్యదర్శి కంగుతిన్నారు.

Updated : 12 Feb 2023 17:19 IST

మాచారెడ్డి: విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఓ గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఒక నెలకు ఏకంగా రూ.11.41 కోట్ల విద్యుత్‌ బిల్లు వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి జనవరి నెలకు సంబంధించి రూ.11,41,63,672 విద్యుత్‌ బిల్లు వేశారు. దీంతో విద్యుత్‌ బిల్లును చూసిన సర్పంచి, కార్యదర్శి కంగుతిన్నారు. రూ.కోట్లలో కరెంట్ బిల్లు రావడంతో గ్రామస్థులు సైతం ఆందోళనకు గురయ్యారు. దీనిపై పంచాయతీ పాలకవర్గం, కార్యదర్శి, సర్పంచి విద్యుత్ అధికారులను నిలదీశారు. 

ఓవైపు గ్రామపంచాయతీలకు నిధులు లేక ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు విద్యుత్ అధికారులు ఏసీడీ ఛార్జీల పేరుతో భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పంచాయతీ కార్యాలయానికి రూ.కోట్లలో విద్యుత్‌ బిల్లు వచ్చిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మాచారెడ్డి ఏఈ వెంకటరమణ వివరణ కోరగా.. సాంకేతిక సమస్య కారణంగా విద్యుత్‌ బిల్లు రూ.కోట్లలో వచ్చిందని, ఉన్నతాధికారుల సహకారంతో బిల్లును పునరుద్ధరిస్తామని ఏఈ  తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని