IndiGo: లగేజీ దించడం మరిచారు.. విమానాన్ని వెనక్కి రప్పించారు!

ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది విమానంలోని లగేజీని దించడం మర్చిపోవడంతో సింగపూర్‌ నుంచి బెంగళూరుకు రావాల్సిన విమానం తిరిగి సింగపూర్‌కే చేరుకుంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Published : 19 Oct 2023 01:30 IST

న్యూ దిల్లీ: సాధారణంగా విమానాలు ఎయిర్‌పోర్ట్‌ నుంచి టేకాఫ్‌ అయిన తర్వాత ఏదైనా మెడికల్‌, టెక్నికల్‌ ఎమర్జెన్సీ వల్ల తిరిగి వెనక్కి వస్తుండటం గురించి వినుంటాం. కానీ, సింగపూర్‌లోని చాంగీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం(IndiGo Flight) లగేజీని మర్చిపోవడం వల్ల వెనక్కి రావాల్సి వచ్చింది. గత ట్రిప్‌ ప్రయాణికుల లగేజీని ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది దించడం మర్చిపోవడంతో ఆ విమానం టేకాఫ్‌ అయిన దాదాపు రెండు గంటల తర్వాత తిరిగి చాంగీ ఎయిర్‌పోర్ట్‌కే వచ్చేసింది. 

సింగపూర్‌-బెంగళూరు మధ్య నడిచే 6E 1006 విమానం బుధవారం బెంగళూరు నుంచి సింగపూర్‌కి చేరుకుంది. అయితే, ఆ విమానంలో ఉన్న లగేజీని సిబ్బంది దించడం మర్చిపోయారు. అది గుర్తించకుండానే విమానం తిరిగి బెంగళూరుకు బయలుదేరింది. ప్రయాణికులు తమ బ్యాగులు, లగేజీ రాకపోవడంతో ఆందోళన చెందారు. సమస్యను గుర్తించిన ఎయిర్‌లైన్స్‌ అధికారులు వెంటనే విమానాన్ని వెనక్కి రప్పించారు. ఈ నేపథ్యంలో కొన్ని గంటల ఆలస్యంగా ఆ విమానం మళ్లీ అక్కడి నుంచి బయలుదేరింది. దీంతో బెంగళూరుకు వెళ్లాల్సిన విమాన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ‘లగేజ్‌ మేనేజ్‌మెంట్‌లో లోపాన్ని గుర్తించాం. వెంటనే విమానాన్ని వెనక్కి రప్పించాం. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’’ అని ఎయిర్‌లైన్స్‌ ప్రకటన విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని