1968లో పుట్టా.. బర్త్‌ సర్టిఫికేట్‌ ఇవ్వరూ!

లఖ్‌నవూ: నవజాత శిశువులకు జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడం సాధారణమే. కానీ ఇక్కడ మాత్రం 40 ఏళ్లకు పైబడిన వాళ్లు వచ్చి జనన ధ్రువీకరణ పత్రం కావాలంటూ కుప్పులతెప్పులుగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇన్నేళ్లలో అవసరంలేని జనన ధ్రువీకరణ పత్రం ఇప్పుడెందుకా? అని అనుకుంటున్నారా. జాతీయ పౌర పట్టిక కోసం ఈ తిప్పలన్నీ. 

Published : 11 Jan 2020 00:35 IST

లఖ్‌నవూలో మున్సిపల్‌ కార్యాలయాలకు క్యూ కట్టిన జనం

లఖ్‌నవూ:  పుట్టిన పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడం సాధారణమే. కానీ ఇక్కడ మాత్రం 40 ఏళ్లకు పైబడిన వాళ్లు వచ్చి జనన ధ్రువీకరణ పత్రం కావాలంటూ కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇన్నేళ్లుగా అవసరంలేని జనన ధ్రువీకరణ పత్రం ఇప్పుడెందుకో అనుకుంటున్నారా? జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పిన నేపథ్యంలోనే ఇలా జనం బారులు తీరుతున్నారు. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌పీఆర్‌), ఎన్‌ఆర్‌సీ కారణంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ వాసులు జనన ధ్రువపత్రాల కోసం మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ కారణంగానే పురపాలక కార్యాలయాల ఎదుట భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. జనన ధ్రువపత్రాల కోసం వస్తున్న వారిలో ఎక్కువ మంది 40 నుంచి 50ఏళ్ల పైబడిన వారే ఉన్నారు. ‘నేను 1968లో పుట్టాను. ఇప్పటి వరకు ఎప్పుడూ నాకు జనన ధ్రువీకరణ పత్రం అవసరం రాలేదు. కానీ సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ వల్ల నేను నా పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి వస్తే జనన ధ్రువపత్రం అవసరం ఉంటుందని తీసుకుంటున్నారు’ అని ఆగ్రాకు చెందిన సర్ఫరాజ్‌ చెప్పుకొచ్చారు. 2018తో పోల్చుకుంటే 2019లో జనన ధ్రువపత్రాలు జారీ మూడు రెట్లు  పెరిగినట్లు మున్సిపల్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో అప్పుడే పుట్టిన శిశువులకు జనన ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చే వాళ్లు. ఇప్పుడు 50ఏళ్లు పైబడిన వారు ఎక్కువ మంది వస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. ‘నా 50ఏళ్లలో ఎన్నడూ జనన ధ్రువీకరణ పత్రంతో అవసరం రాలేదు కానీ సీఏఏ కారణంగా దాన్ని తీసుకోవాల్సి వస్తుంది’ అని మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. దరఖాస్తులు చేసుకుంటున్న వారిలో ముస్లింలే అధికంగా ఉంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని