బాల్యం బావురుమంటోంది!

నగర చిన్నారుల్లో శరీర పరిమాణ సూచి(బీఎంఐ) ప్రమాదకర రీతిలో ఉంది. ఇటీవల ఓ ప్రైవేటు సంస్థ దేశవ్యాప్తంగా ఆయా పాఠశాలల్లోని 1,49,833 మంది ఏడు నుంచి 17 ఏళ్లలోపు పిల్లలను పరీక్షించింది. ఇందులో భాగంగా సదరు సంస్థ సభ్యులు నగరంలోని 21 ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో 11,159 మంది విద్యార్థులను పరీక్షించారు.

Published : 28 Jan 2020 07:59 IST

 59 శాతం పిల్లల్లో తక్కువ బీఎంఐ
 11 వేల మంది చిన్నారులపై సర్వే

ఈనాడు, హైదరాబాద్‌: నగర చిన్నారుల్లో శరీర పరిమాణ సూచి(బీఎంఐ) ప్రమాదకర రీతిలో ఉంది. ఇటీవల ఓ ప్రైవేటు సంస్థ దేశవ్యాప్తంగా ఆయా పాఠశాలల్లోని 1,49,833 మంది ఏడు నుంచి 17 ఏళ్లలోపు పిల్లలను పరీక్షించింది. ఇందులో భాగంగా సదరు సంస్థ సభ్యులు నగరంలోని 21 ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో 11,159 మంది విద్యార్థులను పరీక్షించారు. చాలామంది పిల్లల్లో బీఎంఐ.. వయస్సుకు తగ్గట్లు లేదని గుర్తించారు. ఒక వ్యక్తి ఎత్తు, బరువును పరిగణనలోకి తీసుకొని బీఎంఐ లెక్కిస్తారు. 7- 17 ఏళ్ల మధ్య ఉన్న ఆరోగ్యకర పిల్లల్లో బీఎంఐ 14 నుంచి 20 వరకు ఉండాలి. తాజా సర్వే ప్రకారం నగరంలోని 59 శాతం మంది పిల్లల్లో ఇది ఆందోళనకరంగా ఉన్నట్లు తేలింది. ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరిలో బీఎంఐ సక్రమంగా లేదు. బాలికలతో పోల్చితే బాలురు కొంత నయంగా ఉన్నారు. 52 శాతం పిల్లలు చిన్న చిన్న బరువులను ఎక్కువ దూరం విసరటానికి ఇబ్బందులు పడ్డారు. తక్కువ దూరం కూడా దూకలేని పరిస్థితి ఉంది.

ఆటపాటలకు దూరం..
నగరంలోని చాలా పాఠశాలల్లో ఆట స్థలాలే లేవు. చాలా ప్రైవేటు బడులు అపార్ట్‌మెంట్లలో నడుస్తున్నాయి. పిల్లలను నాలుగు గోడల మధ్య పుస్తకాలకే పరిమితం చేస్తున్నారు. దీంతో వారు ఆటలకు దూరమవుతున్నారు. దీనికితోడు ప్యాకెట్‌ ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నారు. గతంలో జాతీయ పోషకాహార సంస్థ సర్వేలో 35 శాతం పిల్లల లంచ్‌ బాక్సుల్లో తల్లిదండ్రులు జంక్‌ఫుడ్స్‌ పెట్టి పంపుతున్నట్లు తేలింది. ప్యాకెట్‌ ఆహారంలో రుచి కోసం అధిక నూనెలు, ఉప్పు, తీపి ఎక్కువగా వినియోగించడంతో.. అనవసర కొవ్వు పెరిగి అది ఊబకాయానికి దారి తీస్తుంది. పౌష్టికాహార లేమి రక్తహీనతకు కారణమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని