టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

తెలంగాణ రాష్ట్రంలో పాలనా పరమైన మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆదివారం రాత్రి చేపట్టిన స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్ల బదిలీ ఉత్తర్వులతో జిల్లాకు ఇద్దరేసి అదనపు కలెక్టర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు అయింది. రాష్ట్ర వ్యాప్తంగా

Published : 10 Feb 2020 09:00 IST

1. పాలనలో నూతన పంథా

తెలంగాణ రాష్ట్రంలో పాలనా పరమైన మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆదివారం రాత్రి చేపట్టిన స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్ల బదిలీ ఉత్తర్వులతో జిల్లాకు ఇద్దరేసి అదనపు కలెక్టర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు అయింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బదిలీలు చేపట్టిన ప్రభుత్వం జిల్లా సంయుక్త కలెక్టర్‌ పోస్టులో ఉన్న వారిని కూడా తొలగించి అదనపు కలెక్టర్ల హోదాను కేటాయించింది. జిల్లా రెవెన్యూ అధికారుల పోస్టుల్లోనూ (డీఆర్వో) మార్పులు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. మా వార్తకు కట్టుబడే ఉన్నాం

కియా కార్ల తయారీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్‌ నుంచి తమిళనాడుకు తరలించడానికి ఆ సంస్థ ప్రతినిధులు తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ఈ నెల 6వ తేదీన ప్రచురించిన వార్తకు కట్టుబడి ఉన్నట్లు రాయిటర్స్‌ పేర్కొంది. ఆ వార్త వెలువడిన వెంటనే అలాంటి ప్రతిపాదనేదీ లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, కియా సంస్థ ప్రతినిధులు బహిరంగ ప్రకటన చేసినప్పటికీ రాయిటర్స్‌ మాత్రం ఇప్పటివరకూ తమ వార్తకు కట్టుబడే ఉన్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. అన్నపూర్ణ.. మన తెలంగాణ

తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆకలితీర్చే అన్నపూర్ణగా మారింది. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఈ ఏడాది ఆహార ధాన్యాల దిగుబడి రానుందని అర్థ, గణాంకశాఖ ముందస్తు అంచనాల తాజా నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది పంటల సాగు విస్తీర్ణం, ఉత్పాదకత, దిగుబడుల లెక్కలతో పాటు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎలా ఉన్నాయో ఆసక్తికర అంశాలను వివరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి 

4. ఏపీలో ఫైబర్‌నెట్‌ టారిఫ్‌ రూ.50 పెంపు

ఏపీ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌) టారిఫ్‌ను రూ.50 పెంచింది. ప్రస్తుతం రూ.149 కనీస టారిఫ్‌ను సంస్థ వసూలు చేస్తోంది. ఎల్‌వోటీ బాక్సు కోసం రూ.50, జీఎస్టీ కలిపి వినియోగదారుని నుంచి రూ.235 వంతున వసూలు చేస్తోంది. దీనికి మరో రూ.50 పెంచాలని నిర్ణయించింది. పన్నులతో కలిపి ఒక్కో వినియోగదారుడు సుమారు రూ.300 వంతున నెలవారీ ఛార్జీలను చెల్లించాల్సి వస్తోంది. ఫిబ్రవరి నుంచి కొత్త టారిఫ్‌ అమల్లోకి వస్తుందని సంస్థ అధికారులు తెలిపారు.

5. హైదరాబాద్‌లో కారు పూలింగ్‌

తెలంగాణ రాజధానిలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌ను నిరోధించడానికి పోలీసులు సరికొత్త వ్యూహాన్ని అమలుచేయాలని నిర్ణయించారు. నగరంలో తిరిగే కార్లలో ఒక్కరే ప్రయాణించకుండా పూలింగ్‌ పద్ధతిలో నలుగురైదుగురికి తక్కువ కాకుండా ప్రయాణించేలా చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా కార్‌పూలింగ్‌ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలులోకి తేవాలని నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. బస్సుకు విద్యుత్‌ తీగలు తగిలి 10 మంది మృతి

వివాహ నిశ్చితార్థానికి 40 మందితో వెళుతున్న బస్సుకు విద్యుత్‌ తీగలు తగిలి 10 మంది మృతి చెందిన సంఘటన ఆదివారం ఒడిశాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 8 మంది తీవ్రగాయాల పాలయ్యారు. గంజాంజిల్లా డొంకలపాడుకు చెందిన యువకుడు అశోక్‌కు సమీపంలోని చికరడకి చెందిన యువతితో పెళ్లి కుదిరింది. ఆదివారం నిశ్చితార్థానికి ఇరుపక్షాలు నిర్ణయించాయి. దీనికి వరుడి బంధుమిత్రులు 40మంది ఓ ప్రైవేటు స్లీపర్‌బస్సులో యువతి గ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. రాష్ట్రం కాదుగానీ.. మరిన్ని అధికారాలు

పట్టువిడుపులు ప్రదర్శించడంతో బోడోల సమస్య ఎట్టకేలకు పరిష్కారమయింది. ప్రత్యేక బోడోలాండ్‌ రాష్ట్రం కావాలంటూ ఆందోళన చేసిన నాయకులు ఒక మెట్టు కిందికి దిగి స్వయం ప్రతిపత్తి కలిగిన బోడో ప్రాదేశిక ప్రాంతం (బోడో టెరిటోరియల్‌ రీజియన్‌-బీటీఆర్‌సీ) ఏర్పాటుకు సమ్మతించారు. ఈ ప్రాంతం వ్యవహారాలను పర్యవేక్షించడానికి బోడో ప్రాదేశిక మండలి (టెరిటోరియల్‌ కౌన్సిల్‌- బీటీసీ) ఉంటుంది. వాస్తవానికి దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలన్నీ ఈ మండలికి ఉంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదు

పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కేమీ కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పనిసరి కాదని తెలిపింది. పబ్లిక్‌ సర్వీసు ఉద్యోగాల్లో ఎస్‌.సి., ఎస్‌టీలకు పదోన్నతులు ఇవ్వకూడదంటూ 2012 సెప్టెంబరు 5న ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని సవాలు చేస్తూ అక్కడి హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేయగా, న్యాయ స్థానం ప్రభుత్వ ఉత్తర్వును కొట్టివేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. బంగ్లాదేశ్‌దే అండర్‌-19 ప్రపంచకప్‌

బంగ్లాదేశ్‌ చరిత్ర సృష్టించింది. చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంటూ మొదటిసారి  ప్రపంచకప్పును ముద్దాడింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ను ఓడిస్తూ అండర్‌-19 ప్రపంచకప్‌ను చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 3 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఆస్కార్‌ విజేతలు వీరే... లైవ్‌ అప్‌డేట్స్‌

సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక అకాడమీ అవార్డు ‘ఆస్కార్‌’ ప్రదానోత్సవం లాస్‌ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరుగుతోంది. హాలీవుడ్‌ ప్రముఖ నటుడు బ్రాడ్‌ పిట్‌ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకున్నారు. ‘వన్స్‌ అపాన్‌ ఏ టైమ్ ఇన్‌ హాలివుడ్‌‌’ చిత్రంలో నటనకు గానూ ఆయన్ని ఈ అవార్డు వరించింది. ఇక ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ చిత్రంగా ‘టాయ్‌ స్టోరీ 4’కు అవార్డు లభించింది. లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని