Published : 26/02/2020 01:32 IST

గృహిణిగా మెప్పించి..పారిశ్రామికవేత్తగా..

విజయవాడ: విదేశాల్లో మంచి ఉద్యోగంలో స్థిరపడినా, మహిళా పారిశ్రామిక వేత్తగా రాణించాలనే తపన ఆ యువతిని స్వదేశానికి వచ్చేలా చేసింది. వ్యాపారవేత్తగా గుర్తింపు పొందాలన్న సంకల్పం కుటుంబ బాధ్యతతో పాటు సంస్థ భవిష్యత్తును తన భుజాలపై మోసే ధైర్యాన్నిచ్చింది. పోటీ ప్రపంచంలో మహిళ ఏం నెగ్గగలదన్న విమర్శలకు తన ఎదుగుదలే సమాధానమంటున్న యువ వ్యాపారవేత్త జాహ్నవిపై ప్రత్యేక కథనం..

కొన్ని సామాజిక, వ్యక్తిగత పరిస్థితులు ఓ మహిళ విజయవంతమైన వ్యాపారవేత్తగా మారడంలో అడ్డుపడొచ్చు. అలాంటి పరిస్థితులను అనుగుణంగా మలుచుకొని వ్యాపారవేత్తలుగా రాణిస్తున్న మహిళలు ఉన్నారు. విజయవాడకు చెందిన జాహ్నవి ఆ కోవకే చెందుతుంది. ఎం-ఫార్మసీ, వివాహం అనంతరం విదేశాల్లో స్థిరపడిన జాహ్నవి భర్తతో కలిసి అక్కడే కొన్నాళ్లు ఉద్యోగం చేసింది. కానీ తండ్రి స్థాపించిన పేపరు ఉత్పత్తుల సంస్థను ముందుకు నడిపించాలన్న తపనే ఆమెను అక్కడ ఎక్కువ కాలం ఉండనివ్వలేదు. స్వదేశానికి చేరుకొని న్యాయవిద్య పూర్తి చేసి పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మొదటగా తండ్రి పరిశ్రమలో భాగస్వామిగా చేరి పని వాతావరణం గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది. సొంత సంస్థ స్థాపించేందుకు కావల్సిన పరిజ్ఞానం సంపాదించుకుంది. అలా 2017లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కృష్ణా జిల్లాలోని తేలప్రోలులో కృష్ణా ఆంధ్రా పేపర్‌ ప్రొడక్ట్స్‌ పేరుతో ప్యాకేజింగ్‌ అట్టపెట్టల తయారీ కంపెనీని ప్రారంభించింది. ఓ సంస్థను స్థాపించి నడిపిస్తున్నా.. కంపెనీ మార్కెట్లో నిలబడుతుందా అన్న విమర్శలు నిత్యం చెవిన పడుతున్నా ఏనాడు ఆమె వెనకడుగు వేయలేదు. ఇద్దరు ఆడపిల్లలకు తల్లిగా కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే తండ్రికి తగ్గ కుమార్తెగా వ్యాపారాన్ని లాభాల బాటన నడిపిస్తోంది. 

ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల నుంచి ముడి సరుకును దిగుమతి చేసుకుంటుంది. కజారియా, జాన్సన్‌, శాంసంగ్‌, పానసోనిక్‌, అమెరికన్‌ స్టాండర్డ్‌, క్యాడ్బరీ, మదర్‌ డైరీ, హెరిటేజ్‌ లాంటి అగ్రశ్రేణి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని తమ ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తోంది. రోజుకు పది నుంచి పదిహేను వేల వరకు అట్టపెట్టలు తయారు చేస్తోంది. సౌత్‌ ఇండియన్‌ బెస్ట్‌ అచీవర్స్‌ అవార్డు, బెస్ట్‌ ఆర్గనైజేషన్‌ ఇన్‌ ఇండియా పురస్కారాలను సొంతం చేసుకున్న జాహ్నవి, భవిష్యత్తును అంచనా వేసి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు నిరంతరం కష్టపడితే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తోంది.

 

 


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని