చైనా మెయిల్స్‌తో కరోనా వైరస్‌ సోకుతుందా?

కరోనా సమాచారం తెలుసుకొనేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన హైల్ప్‌లైన్లకు విపరీతంగా స్పందన లభిస్తోంది. కొవిడ్‌-19 లక్షణాల గురించి కొందరు ఆరా తీస్తుండగా మరికొందరు లేనిపోనివి ఊహించుకొని గాబరా పడుతున్నారు. ఇంకొందరేమో చెత్త ప్రశ్నలు వేసి విసిగిస్తున్నారు....

Published : 14 Apr 2020 01:37 IST

‘చైనా తయారీ వస్తువులు ముట్టుకుంటే కొవిడ్‌-19 సోకుతుందా?’

కరోనా హెల్ప్‌లైన్లకు ప్రశ్నల వరద

ముంబయి: కరోనా సమాచారం తెలుసుకొనేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన హైల్ప్‌లైన్లకు విపరీతంగా స్పందన లభిస్తోంది. కొవిడ్‌-19 లక్షణాల గురించి కొందరు ఆరా తీస్తుండగా మరికొందరు లేనిపోనివి ఊహించుకొని గాబరా పడుతున్నారు. ఇంకొందరేమో చెత్త ప్రశ్నలు వేసి విసిగిస్తున్నారు. దీంతో హెల్ప్‌లైన్‌ బృందాలు వడపోత మొదలుపెట్టాయి. అవసరమైన కాల్స్‌కు మాత్రమే వైద్యులతో సమాధానాలు చెప్పిస్తున్నాయి. మిగతా వాటిని కాల్‌ సెంటర్‌ ఉద్యోగులే తీసుకుంటున్నారు.


‘నాకు ఫ్లూ తరహా లక్షణాలు ఉన్నాయి. అంటే నాకు కరోనా సోకిందా?’, ‘చైనాతో తయారైన వస్తువులు తాకితే కొవిడ్‌ సోకుతుందా’, ‘వేసవిలో కరోనా వైరస్‌ చచ్చిపోతుందా?’, ‘మాంసాహారం, బయటదొరికే ఆహారం మానేయాలా?’, ‘కోలుకోవడంపై ధూమపానం ప్రభావం చూపిస్తుందా’, ‘ఫేస్‌ మాస్క్‌లతో ఉపయోగం ఉంటుందా?’, ‘సబ్బు కన్నా హ్యాండ్‌ శానిటైజర్లు మెరుగా?’, ‘మా ఇంట్లోని పెద్దవారికి వైరస్‌ సోకుతుందా?’ వంటి ప్రశ్నల్ని ఎక్కువగా అడుగుతున్నారు. మరికొందరేమో ఆందోళనతో ఫోన్లు చేస్తున్నారని తెలిసింది. ‘చైనా నుంచి వచ్చే మెయిల్స్‌తో కరోనా వైరస్‌ వస్తుందా?’, ‘వేడినీరు తాగితే వైరస్‌ చచ్చిపోతుందా?’, ‘ఇతరులతో పోలిస్తే భారతీయుల రోగనిరోధక శక్తి ఎక్కువా?’, ‘ఇంట్లో టైల్స్‌ ఉంటే రిస్క్‌ ఎక్కువగా ఉంటుందా?’,‘గడ్డాలు, మీసాలు ఉంటే వైరస్‌ ఎక్కువగా సోకుతుందా?’ వంటి ప్రశ్నలు అడుతున్నారు. వీటికి జవాబులు చెప్పేందుకు వైద్యులు ఇబ్బంది పడుతున్నారు.


ప్రజలు తమ సందేహాలను తీర్చుకోవాలని భావిస్తున్నారని గోవా పోర్టియా మెడికల్‌ డైరెక్టర్‌ విశాల్‌ సెహగల్‌ అన్నారు. మార్చి 3న తాము ఏర్పాటు చేసిన ఛాట్‌ బాట్‌కు 16 దేశాల నుంచి ఏకంగా 15 లక్షల ప్రశ్నలు వచ్చాయని తెలిపారు. హెల్ప్‌లైన్‌కు ప్రతిరోజూ 100 కాల్స్‌ వస్తున్నాయని పేర్కొన్నారు. కొందరు ముందు జాగ్రత్త కోసం మరికొందరు ఆందోళనతో ఫోన్లు చేస్తున్నారని వెల్లడించారు. కొందరు ‘బీర్‌ తాగితే కరోనా వైరస్‌ నుంచి ఉపశమనం ఉంటుందా?’ వంటి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారన్నారు.


వాట్సప్‌లో పంచుకొనే అసత్య సమాచారంతో ఎక్కువ మంది భయపడుతున్నారని ఫోర్టిస్‌ ఆస్పత్రి పల్మనాలజీ అధినేత వివేక్‌ నంగియా తెలిపారు. వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఆందోళన చెందకుండా ముందు నిజానిజాలేమిటో తెలుసుకోవాలన్నారు. ‘వాళ్లు అడిగేవన్నీ అంతరాయం లేకుండా నేను వింటున్నాను. జవాబు చెప్పాక వారి బంధువులు, సన్నిహితులతో పంచుకోవాలని సూచిస్తున్నా’ అని గుడ్‌గావ్‌ పరాస్‌ ఆస్పత్రి వైద్యుడు రాజేశ్‌ కుమార్‌ తెలిపారు. ‘కొవిడ్‌-19 రాకుండా యాంటీబయాటిక్స్‌ అడ్డుకుంటాయా?’, ‘కరోనా రాకుండా లేదా నయం చేసేందుకు ఏవైనా చికిత్సా పద్ధతులు ఉన్నాయా?’, ‘నేను హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ సొంతంగా వాడుకోవచ్చా?’ వంటి ప్రశ్నలు అడుగుతున్నారని గాజియాబాద్‌ కొలంబియా ఏసియా ఆస్పత్రి వైద్యురాలు జ్ఞాన భారతి అన్నారు.


కొందరు ఏ మాత్రం సంబంధం లేని ప్రశ్నలతో విసిగిస్తుండటంతో ఆ కాల్స్‌ను వడపోస్తున్నామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ‘ఆల్కహాల్‌ సేవిస్తే వైరస్‌ చచ్చిపోద్దా?’, ‘ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ఇరుకైన గదిలో మేం ఉండొచ్చా?’, ‘కరోనా వైరస్‌కు తేనీరు తాగితే పనిచేస్తుందా?’ వంటి ప్రశ్నలకు కాల్‌సెంటర్‌ ఉద్యోగులతో సమాధానాలు చెప్పిస్తున్నారట. అయితే ఎక్కువ మంది తమ పిల్లలకు ఏం చెప్పాలి? ఏం చెప్పకూడదో తెలుసుకొనేందుకు కాల్‌ చేయడం గమనార్హమని ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ మానసిక వైద్య విభాగం డైరెక్టర్‌ సమీర్‌ పారిఖ్‌ అన్నారు. ‘ఒకప్పుడు తమ కుటుంబంతో గడిపేందుకు సమయం దొరకడం లేదని, ఉద్యోగాన్ని, జీవితాన్ని సమతూకం చేయలేకపోతున్నామని చెప్పినవారే ఇప్పుడు పిల్లలతో 24 గంటలు వేగలేకపోతున్నామని చెప్పడం విచిత్రంగా అనిపిస్తోంది’  అని ఆయన వివరించారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts