పిజ్జా బాయ్‌కి కరోనా: క్వారంటైన్‌కు 72 కుటుంబాలు

దిల్లీలో 19 సంవత్సరాల పిజ్జా డెలివరీ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ కావటంతో రాజధానిలో కలకలం రేగింది.

Published : 16 Apr 2020 13:56 IST

దిల్లీ: 19 సంవత్సరాల పిజ్జా డెలివరీ బాయ్‌కి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ కావటంతో దేశ రాజధానిలో కలకలం రేగింది. సదరు యువకుడు ఆహారాన్ని అందించేందుకు వెళ్లిన కుటుంబాలను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి... బాధిత యువకుడు దక్షణ దిల్లీలోని మాలవీయ నగర్‌లో ఉన్న ఓ రెస్టారెంట్‌లో పనిచేసేవాడు. ఈ ఆదివారం వరకు అతను విధుల్లో ఉన్నాడు. తరువాత ఆ యువకుడు అనారోగ్యం పాలు కావటంతో అతన్ని ఆర్‌ఎంఎల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

అతను విధుల్లో ఉన్న ఆఖరి 15 రోజుల్లో హౌజ్‌ ఖాస్‌, మాలవీయ నగర్‌, సావిత్రి నగర్‌ తదితర ప్రాంతాల్లో 72 కుటుంబాలకు ఆహారాన్ని సరఫరా చేశాడు. ప్రస్తుతం ఈ యువకుడికి కొవిడ్‌-19 సోకడంతో, ఆ కుటుంబాలన్నిటినీ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించి, వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. కాగా, యువకుడితో కలసి పనిచేసిన మరో 20 డెలివరీ ఉద్యోగులను కూడా క్వారంటైన్‌లో ఉంచినట్టు అధికారులు తెలిపారు.

ఈ యువకుడు విదేశీ ప్రయాణం చేయలేదని... ఇతను ఆహారాన్ని అందించిన కుటుంబాలలో ఒకరి నుంచి ఈ యువకుడికి కొవిడ్‌-19 సోకి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. దిల్లీలో ఇప్పటి వరకు  1,578 మందికి కరోనా సోకగా, మరణాల సంఖ్య 30 గా ఉంది. ఇక ఈ సంఘటనతో ఆన్‌లైన్‌ ద్వారా ఆహారాన్ని పొందే అలవాటున్న లక్షలాది ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని