వారిని స్వస్థలాలకు చేర్చడం వీలుకాదా?:హైకోర్టు

వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడం వీలు కాదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి

Updated : 27 Apr 2020 17:49 IST

హైదరాబాద్‌: ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడం వీలు కాదా? అని  తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి వివరాలు తెలపాలని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌కు సూచించింది. వలస కూలీల ఇబ్బందులపై న్యాయవాది పీవీ కృష్ణయ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టింది. 

తెలంగాణలో వలస కార్మికులు ఇబ్బంది పడుతున్నారని.. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌ వలస కూలీలు వందల కి.మీ ఎండలో నడుచుకుంటూ వెళ్తున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని.. లేదా ఇక్కడే ఉంచి తగిన వసతులు కల్పించాలని ఆయన కోరారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. వలస కూలీల అవస్థలు బాధ కలిగిస్తున్నాయని, స్వస్థలాలకు పంపడం మంచిదని వ్యాఖ్యానించింది. హైకోర్టు అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఏజీ తెలిపారు. ఈ అంశంపై మే 11లోపు వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఐసీఎంఆర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

పోలీసులు దురుసుగా వ్యవహరిస్తున్నారంటూ వ్యాజ్యం

లాక్‌డౌన్‌ అమలు చేసే క్రమంలో పోలీసులు దురుసుగా, చట్టవిరుద్ధంగా వ్యవహరించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది. సామాజిక కార్యకర్త మసూద్ రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తున్న వారిని, ప్రభుత్వం అనుమతించిన జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చట్టబద్ధంగా వ్యవహరించేలా పోలీసులకు సూచనలు చేయాలని కోరారు. పోలీసులు జప్తు చేసిన వాహనాలను విడుదల చేసి కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని కఠిన ఆంక్షలతో క్లినిక్‌లు, ఆస్పత్రులు తెరిచేలా ఆదేశించాలని కోరారు. వీటన్నింటిపై రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డిల ధర్మాసనం.. వివరణ ఇవ్వాలని సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీతో పాటు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని