పట్టణ ఉపాధి హామీ  పథకం అవసరం

దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే, కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే ‘పట్టణ ఉపాధి హామీ పథకం’ అత్యంత అవసరమని ఆర్థికవేత్తలు, సామాజిక కార్యకర్తలు అంటున్నారు. నిరుద్యోగం తగ్గుదల, అర్హతకు తగిన ఉపాధి, ఆదాయ పెరుగుదల.. చిన్న పట్టణాల్లో డిమాండ్‌ను పెంచుతాయని వారు .....

Published : 01 May 2020 22:10 IST

దిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకొని, కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే ‘పట్టణ ఉపాధి హామీ పథకం’ అత్యంత అవసరమని ఆర్థికవేత్తలు, సామాజిక కార్యకర్తలు అంటున్నారు. నిరుద్యోగం తగ్గుదల, అర్హతకు తగిన ఉపాధి, ఆదాయ పెరుగుదల.. చిన్న పట్టణాల్లో డిమాండ్‌ను పెంచుతాయని వారు పేర్కొన్నారు. వ్యాపారాలు విజయవంతం అయ్యేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడతాయని సూచించారు.

‘రీ థింకింగ్‌ ఇండియా సిరీస్‌’లో భాగంగా వచ్చిన ‘రివైవింగ్‌ జాబ్స్‌: యాన్‌ ఎజెండా ఫర్‌ గ్రోత్‌’ తాజా వాల్యూమ్‌లో సారథి ఆచార్య, విజయ్‌ మహాజన్‌, మదన్‌ పాఠకి వంటి ఆర్థిక, సామాజిక వేత్తలు మహమ్మారి కాలంలో నిరుద్యోగంపై విభిన్న కోణాల్లో స్పృశించారు.

ఉత్పత్తి పెరుగుదల, ప్రభుత్వ సేవలు మెరుగ్గా అందడం చేత నాణ్యమైన జీవితం, ఉద్యోగాల పెరుగుదల, నైపుణ్యాలతో ప్రైవేటు రంగంలో ఉత్పత్తి పెరుగుదల, అసంఘటిత రంగాల్లో ఆదాయవృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థకూ ఊతంగా నిలుస్తాయని వారన్నారు. 2012 తర్వాత యువత వేగంగా శ్రామిక విపణిలోకి వచ్చారని కానీ ఉద్యోగాల సృష్టి తగ్గిందని పేర్కొన్నారు. 2020-2030 మధ్య ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.

రానున్న దశాబ్దాల్లో జనాభాను దేశం అత్యుత్తమంగా ఎలా ఉపయోగించుకోవాలో ‘రివైవింగ్‌ జాబ్స్‌’లో నిపుణులు సూచించారు. ఉపయోగించుకోవడంలో విఫలమైతే కోట్లాది మంది పేదరికంలో మగ్గే ప్రమాదం ఉందన్నారు. భారత్‌లో ఉద్యోగ సంక్షోభం నెలకొందని, ఎక్కువ మంది యువత విపణిలో ప్రవేశించి ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. కానీ ఉపాధి అంతగా దొరకడం లేదని జేఎన్‌యూ ప్రొఫెసర్‌ మెహరోత్ర వెల్లడించారు.

‘మొత్తం జనాభాలో పనిచేసే వయస్కులు పెరుగుతున్నారు. దీంతో దేశానికి లాభం కలగాలి. కానీ తక్కువ మంది ఉపాధి కోసం వెతుకున్నారు. అందుకే కార్మిక భాగస్వామ్య రేటు (ఎల్‌ఎఫ్‌పీఆర్‌) తగ్గుతోంది. హోదాకు తగిన ఉపాధి దొరక్కపోవడంతో శోధించడం మానేస్తున్నారు. యువత నిరుత్సాహంగా ఉందనేందుకు ఇది సూచన. ఫలితంగా బహిరంగ నిరుద్యోగిత రేటు పెరుగుతోంది. 2012-18 మధ్య 2.2 నుంచి 6.1 శాతానికి  పెరిగింది. 15-29 ఏళ్ల వారిలో ఇది 6.1 నుంచి 17.8 శాతంగా ఉంది’ అని ఆయన వెల్లడించారు.

చదవండి: టి-కణాలు తగ్గితే కరోనా ఉగ్రరూపం

చదవండి: లాక్‌డౌన్‌ ముగిశాక విద్యార్థులకు రక్షణ ఎలా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని