మద్యం దుకాణాల వద్ద బారులు..

కరోనా వైరస్‌ విజృంభిస్తు్న్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా మద్యం ప్రియులు ఇన్నాళ్లు విలవిల్లాడిపోయారు. తాజాగా గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో మద్యం

Updated : 13 Sep 2023 16:32 IST

అమరావతి: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా మద్యం ప్రియులు ఇన్నాళ్లు విలవిల్లాడిపోయారు. తాజాగా గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. కంటైన్‌మెంట్‌ జోన్లు తప్ప మిగతా ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి మద్యం ప్రియులు దుకాణాల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరారు.

గుంటూరు జిల్లా బెల్లంకొండ ప్రాంతంలో ఉదయం దుకాణాలు తెరవక ముందే మందుబాబులు పడిగాపులు కాస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు, విశాఖ, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, విజయవాడ తదితర జిల్లాల్లో మద్యం ప్రియులు దుకాణాల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పలు చోట్ల భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా చేరారు.

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన మద్యం దుకాణాలు రాత్రి 7 గంటల వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే 25 శాతం ధరలు పెంపుదల చేసిన ప్రభుత్వం.. వాటి పట్టికలను దుకాణాల వద్ద ఉంచాయి. 

అప్‌డేట్‌ కాని ధరలు..

పెరిగిన మద్యం ధర అప్‌డేట్‌ కాకపోవడంతో అమ్మకాలు ఆలస్యమవుతున్నాయి. దీంతో మద్యం దుకాణాల వద్ద గందరగోళం నెలకొంది. భారీగా వస్తున్న మందుబాబులను పోలీసులు సామాజిక దూరం పాటించేలా వరుసల్లో నిలబెడుతున్నారు.

మద్యం దుకాణాన్ని మూసివేయించిన మహిళలు..

నెల్లూరు జిల్లా బోగోలు మండలం నాగులవరంలో మద్యం దుకాణాన్ని స్థానిక మహిళలు మూసివేయించారు. కరోనా భయంతో తమ ప్రాంతంలో మద్యం దుకాణాన్ని నిర్వహించొద్దని వారు అధికారులను కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని