రోడ్డుపైనే ప్రసవం, అనంతరం 150కిమీ నడక

స్వగ్రామం చేరేందుకు కాలినడకన బయలుదేరిన ఓ వలస కార్మికురాలికి రోడ్డు పైనే ప్రసవించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆమె కష్టాలు అక్కడితో ఆగలేదు...

Published : 14 May 2020 01:11 IST

వలస కార్మికురాలి కష్టం

సాత్నా: లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కార్మికులను స్వంత ఊర్లకు పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ వారిలో అనేక మంది నడక మార్గాన్నే ఆశ్రయిస్తున్నారు. అదేవిధంగా స్వగ్రామం చేరేందుకు కాలినడకన బయలుదేరిన ఓ వలస కార్మికురాలికి రోడ్డు పైనే ప్రసవించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆమె కష్టాలు అక్కడితో ఆగలేదు... సహాయం కోసం పుట్టిన బిడ్డతో సహా మరో 150 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. పొట్టకూటి కోసం పరాయి ప్రాంతాలకు వచ్చిన వలస కూలీల కష్టాలకు అద్దం పట్టే ఈ సంఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. 

లాక్‌డౌన్‌ సందర్భంగా పనులు లేకపోవటంతో రాకేశ్‌ కౌల్‌ అనే వ్యక్తి, ఆయన భార్య శకుంతల మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి తమ స్వగ్రామమైన సత్నాకు కాలినడకన ప్రయాణమయ్యారు. మంగళవారం నాటికి వారు మధ్యప్రదేశ్‌లోని బిజాసన్‌ గ్రామానికి చేరుకున్నారు. ఇంతలో నెలలు నిండిన శకుంతలకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. అసహాయ పరిస్థితిలో ఆమె రహదారి పక్కనే ప్రసవించారు. ‘‘ప్రసవం అయిన తరువాత శకుంతల ఓ రెండు గంటల సేపు విశ్రాంతి తీసుకుంది. అనంతరం పుట్టిన బిడ్డతో సహా మళ్లీ నడక మొదలుపెట్టి సుమారు 150 కిలోమీటర్లు నడిచాము.’’ అని ఆమె భర్త రాకేశ్‌ కౌల్‌ తెలిపారు. ఈ సమాచారం అందిన వెంటనే మధ్యప్రదేశ్‌ అధికారులు వారికి అవసరమైన ఆహారం, ఇతర సహాయాన్ని అందచేసి వారిని ఊరికి పంపే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగానే ఉన్నట్టు అధికారులు తెలిపారు. వారికి అవసరమైన ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని... అనంతరం హోమ్‌ క్వారంటైన్‌కు పంపామని వారు వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని