శ్రామిక్‌ రైళ్లు.. రాష్ట్రాల సమ్మతి అక్కర్లేదు!

లాక్‌డౌన్‌ విధించడంతో ఉన్నచోట ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్న వలస కూలీలను స్వస్థలాలకు తరలించేందుకు శ్రామిక్‌ రైళ్లు నడిపే విషయంలో కేంద్రం పలు కీలక మార్పులు......

Updated : 19 May 2020 17:45 IST

శ్రామిక్‌ రైళ్లు నడిపే ప్రమాణికాల్లో రైల్వేశాఖ కీలక మార్పు  

దిల్లీ: లాక్‌డౌన్‌ విధించడంతో ఉన్నచోట ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్న వలస కూలీలను స్వస్థలాలకు తరలించేందుకు శ్రామిక్‌ రైళ్లు నడిపే విషయంలో కేంద్రం పలు కీలక మార్పులు చేసింది. కూలీలను గమ్య స్థానాలకు చేర్చే శ్రామిక్‌ రైళ్లకు నడిపేందుకు ఆయా రాష్ట్రాల సమ్మతి అవసరం లేదని రైల్వేశాఖ స్పష్టంచేసింది. కొన్ని రాష్ట్రాలు వ్యవహరిస్తున్న తీరుతో ఈ ప్రామాణికాల్లో మార్పలు చేసింది. బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌ వంటి కొన్ని రాష్ట్రాలు తమ వలస కార్మికులతో వెళ్తున్న రైళ్లను అనుమతించడంలేదనే విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు నడిపే విషయంలో గమ్యస్థాన రాష్ట్రాల సమ్మతి అవసరం లేదని రైల్వేశాఖ అధికార ప్రతినిధి రాజేశ్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. వలస కూలీల వివరాలను రైల్వేశాఖకు పంపితే తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇప్పటివరకు పంపే రాష్ట్రం, గమ్యస్థాన రాష్ట్రం ఇరువురు అంగీకారంతోనే వలస కార్మికుల తరలింపు కొనసాగుతోంది. అయితే, తాజాగా హోంశాఖ అనుమతులు ఉంటే స్వరాష్ట్రానికి పంపించే వెసులుబాటు కల్పించేలా మార్పులు చేసింది.  

గత కొన్ని రోజులుగా కేంద్రమంత్రులకు,  పశ్చిమ బెంగాల్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మధ్య వలస కార్మికుల తరలించే విషయంలో సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. వలస కూలీలను తీసుకెళ్లే ఎక్కువ రైళ్లను రాష్ట్రాలు అనుమతించాలని కేంద్రం కోరుతోంది. దీంతో ఆత్మరక్షణలో పడిన రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ రైళ్లను అనుమతించడం మాని కేంద్రంపై ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయం చేస్తున్నాయని కేంద్రం మండిపడుతోంది. మరోవైపు, కేంద్రహోంమంత్రి అమిత్‌ షా కూడా పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో మాట్లాడి వీలైనన్ని ఎక్కువ రైళ్లను అనుమతించాలని కోరినట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని