కరోనా: లక్షణాల్లేకపోయినా కారణమవుతున్నారు!

లక్షణాలు కనిపించని లేదా మొదలవని బాధితుల వల్ల అతితక్కువ కాలంలో కొవిడ్‌-19 వ్యాప్తి తీవ్రమయ్యే ప్రమాదమున్నట్టు ఓ పరిశోధనలో తెలిసింది.

Published : 21 May 2020 12:45 IST

దిల్లీ: ప్రస్తుతం భారత్‌లో కొన్ని సడలింపులతో లాక్‌డౌన్‌-4 అమలులో ఉంది. దీనిలో భాగంగా ప్రజలు రవాణా సదుపాయాలను వినియోగించేందుకు, కార్యాలయాలకు వెళ్లేందుకు అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో లక్షణాలు కనిపించని లేదా బయటపడని బాధితుల వల్ల అతి తక్కువ కాలంలో కొవిడ్‌-19 వ్యాప్తి తీవ్రమయ్యే ప్రమాదమున్నట్టు ఓ పరిశోధనలో వెల్లడైంది. 

నిర్ధారణ అయినా కనపడని లక్షణాలు

విదేశాలలో చదివి చైనాకు తిరిగివచ్చిన కొందరు విద్యార్థుల హోటల్‌ గదులలో కొవిడ్‌-19 పరిశోధనలను జరిపారు. వీరిలో అనుమానించదగ్గ లక్షణాలేవీ కనిపించనప్పటికీ వారికి కరోనా పాజిటివ్‌ అని వైద్య పరీక్షల్లో తెలిసింది. అయితే నిర్ధారణ అయిన మూడు గంటల అనంతరం కూడా వారిలో ఏ లక్షణాలు కనిపించలేదని ఆ పరిశోధనలో బయటపడింది. విద్యార్ధులు నివసించిన గదుల్లోని డోర్‌ హ్యాండిల్స్‌, స్విచ్‌లు, టీవీ రిమోట్లు, దుప్పట్లు, టవళ్లు, టాయిలెట్‌ సీట్లు తదితర వివిధ వస్తువుల నుంచి 22 నమూనాలను సేకరించారు. కాగా, వీటిలో ఎనిమిదింటిలో కొవిడ్‌-19 ఆనవాళ్లు ఉన్నట్టు పరిశోధకులు తెలిపారు. కరోనా రోగులు ఉపయోగించిన దుప్పట్లు తదితర వస్తువులను మార్చేటపుడు, శుభ్రపరిచేందుకు సరైన విధానాలను అవలంబించాల్సిన ఆవశ్యకతను ఈ ఫలితాలు తెలుపుతున్నాయని వారు అన్నారు. ఈ పరిశోధన వివరాలను అమెరికాకు చెందిన ఎమర్జింగ్‌ ఇన్ఫెక్టివస్‌ డిసీజెస్‌ జర్నల్‌లో ప్రచురించారు.

మొదటి రోజు నుంచీ వ్యాప్తి

కరోనా విషయంలో రోగలక్షణాలు బయటపడేందుకు దీర్ఘకాలం పడుతోంది. ‘ఇంక్యుబేషన్‌ పీరియడ్‌’ అని పిలిచే ఈ కాలవ్యవధి సగటున 5.1 రోజులుగా ఉంది. అయితే ఈ విధమైన రోగుల ద్వారా మొదటిరోజు నుంచి కూడా కొవిడ్‌ వ్యాప్తి చెందుతుందని నిపుణులు స్పష్టం చేశారు. వ్యాధి సోకినప్పటికీ దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది వంటి లక్షణాలు బహిర్గతం కాని ఈ బాధితులు, వ్యాధి సంక్రమణ తీవ్రమవటానికి కారణమవుతున్నారని పరిశోధకులు వివరించారు. వ్యాధి లక్షణాలు కనపడకపోవటం యువకులు, ఆరోగ్యవంతుల్లో అధికమని వారు తెలిపారు. వ్యాధి నిర్ధారణ అయిన వారి ద్వారా వ్యాప్తిని లాక్‌డౌన్ల వల్ల నిరోధించవచ్చు. అయితే విధులకు హాజరయ్యే క్రమంలో వివిధ ప్రదేశాలకు ప్రయాణించే యువకులు, ఆరోగ్యవంతుల వల్ల కొవిడ్‌ వ్యాప్తి అధికమయ్యే అవకాశం ఎక్కువని... ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఆచార్యులు డాక్టర్‌ అంబరీష్‌ గుప్తా తెలిపారు.

2-3 రోజుల ముందు వ్యాధి వ్యాప్తి తీవ్రం

44 శాతం కరోనా వైరస్‌ వ్యాధి, లక్షణాలు కనిపించని వారి వల్లే వ్యాప్తి చెందినట్లు ఓ పరిశోధనలో తేలింది. కరోనా సోకినప్పుడు లక్షణాలు బయటపడటానికి రెండు లేదా మూడు రోజుల ముందు వ్యాప్తి ప్రమాదం అధికంగా ఉన్నట్టు పరిశోధకులు తెలిపారు. సింగపూర్‌లో 48 శాతం, చైనాలో 62 శాతం ఈ విధంగానే కొవిడ్‌ వ్యాప్తి జరిగిందని మరో పరిశీలనలో తెలిసింది. జనసమ్మర్థం ఎక్కువగా గల ప్రాంతాల్లో నివిసించేవారికి, మూత్రపిండాల వ్యాధులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి, వృద్ధులకు, పురుషులకు, పేదవారికి కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు. 

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌లు, ఔషధాలు వచ్చే వరకూ... సామాజిక దూరం పాటించటం, మాస్కులను ధరించటం, చేతులను తరచూ క్రిమిరహితం చేసుకోవటం మాత్రమే కొవిడ్‌-19 సోకకుండా అరికట్టే మార్గమని వైద్య నిపుణులు మరోమారు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని