ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రద్దు

కరోనా వ్యాప్తి వల్ల పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం

Updated : 20 Jun 2020 19:06 IST

విజయవాడ: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కారణంగా పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటించారు. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేస్తామని చెప్పారు. కేంద్ర హోంశాఖ నిబంధనలకు అనుగుణంగా ఈ నెల 15న భాగస్వామ్య పక్షాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయం సేకరించామని మంత్రి తెలిపారు.

‘‘పరీక్షల నిర్వహణ కోసం విద్యార్థుల తల్లిదండ్రులు, జిల్లాల కలెక్టర్లు, పోలీసులు, ఇతర విభాగాలు కలిసి పని చేయాలి. ఇంతమంది ఒకే చోట గుమిగూడటం అంత శ్రేయస్కరం కాదని పరీక్షలు వాయిదా వేశాం. కరోనా ప్రభలుతున్న తరుణంలో ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కూడా పరీక్షలు రద్దు చేయాలని ఆదేశించారు’’ అని మంత్రి సురేశ్‌ చెప్పారు. 

తొలుత జులై 10-17 వరకు పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 6.3 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. వీరి కోసం ఆన్‌లైన్‌, దూరదర్శన్ ద్వారా పాఠాలు చెప్పారు. దీంతో పాటు పరీక్షల నిర్వహణ కోసం 11 పేపర్లను ఆరుకు కుదించారు. భౌతిక దూరం పాటించడం కోసం పరీక్ష కేంద్రాలు రెట్టింపు కూడా చేశారు. శానిటైజర్లు, థర్మల్ స్కానర్,లు మాస్కులు సిద్ధం చేశారు. కానీ పరిస్థితి అదుపులో లేకపోవడంతో పరీక్షలు రద్దు చేశారు.
 

ఇంటర్‌ సప్లిమెంటరీ కూడా రద్దు

రాష్ట్రంలో త్వరలో జరగాల్సిన ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఈ మేరకు పరీక్ష ఫీజును వాపసు చేస్తామని చెప్పారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫెయిలైనవారు కూడా పాస్‌ అయినట్లే అని మంత్రి సురేశ్‌ చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని