Hyd Metro: 4లక్షల నుంచి 4వేలకు..

మెట్రో రైలుపై లాక్‌డౌన్‌ ప్రభావం తీవ్రంగా పడింది. ఉదయం ఈ సర్వీసులు నడుస్తున్నా..

Updated : 21 May 2021 09:47 IST

 కొవిడ్‌ భయం.. ‘మెట్రో’ రవాణాకు దూరం 

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రో రైలుపై లాక్‌డౌన్‌ ప్రభావం తీవ్రంగా పడింది. ఉదయం ఈ సర్వీసులు నడుస్తున్నా.. ఎక్కేవారే కరవయ్యారు. రోజువారీ సగటు ప్రయాణికుల సంఖ్య ఊహించని స్థాయికి పడిపోయింది. రోజూ మూడు కారిడార్లలో కలిపి నాలుగు వేల మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు. నగరంలో మెట్రో రైళ్లు ప్రారంభమైన తర్వాత ప్రయాణికుల రాకపోకల సంఖ్య ఇంత తక్కువ ఉండటం ఇదే మొదటిసారి. కొవిడ్‌కు ముందు నిత్యం నాలుగు లక్షల మంది ప్రయాణించేవారు.  
ప్రతి 15 నిమిషాలకు ఒకటి.. నగరంలో 20 గంటల లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకే కార్యకలాపాలకు అనుమతిస్తున్నారు.  అందుకు అనుగుణంగా మెట్రో రైలు వేళల్ని ఈనెల 12 నుంచి మార్పు చేశారు. టర్మినల్‌ స్టేషన్లు మియాపూర్, ఎల్‌బీనగర్, నాగోల్, రాయదుర్గం, జేబీఎస్‌ నుంచి ఉదయం 7 గంటలకు మొదటి మెట్రో బయలుదేరుతోంది. ఇక్కడి నుంచి చివరి మెట్రో 8.45 గంటల వరకే అందుబాటులో ఉంది. ప్రతి 15 నిమిషాలకు ఒక మెట్రో నడుపుతున్నారు. రోజులో వెయ్యికిపైగా ట్రిప్పులు నడిపిన స్థానంలో ప్రస్తుతం 30 ట్రిప్పుల లోపే నడుపుతున్నారు.  
పొడిగింపుతో తర్జనభర్జన.. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఈనెల చివరి వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో రైళ్లను నడపడంపై మెట్రోవర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. గతేడాది కొవిడ్‌ మొదటి దశ లాక్‌డౌన్‌తో మెట్రో రైళ్లు 169 రోజుల పాటు డిపోలకే పరిమితం అయ్యాయి. తాజా పరిణామాలతో ఆ నష్టాలు మరింత పెరిగాయి.
4 లక్షలు మహమ్మారికి ముందు మెట్రోలో రోజువారీ సగటు ప్రయాణికుల రాకపోకలు (గత ఏడాది మార్చి 23 ముందువరకు)
2.20 లక్షలు  కొవిడ్‌ మొదటి వేవ్‌ అనంతరం మెట్రో పునఃప్రారంభం తర్వాత ప్రయాణికులు (ఈ ఏడాది మార్చి వరకు)
1.0 లక్షలు  కరోనా భయానికి తోడు రాత్రి కర్ఫ్యూతో కుదించిన మెట్రో వేళలతో తగ్గిన ప్రయాణికులు (ఏప్రిల్‌ నెలలో)
4వేలు ఇరవై గంటల లాక్‌డౌన్‌తో    పడిపోయిన ప్రయాణికుల సంఖ్య  (మే 12 తర్వాత నుంచి) 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని