రామప్ప-లక్నవరం అనుసంధానమెప్పుడో?
దేవాదుల నీటిని రామప్ప నుంచి లక్నవరం చెరువులోకి తరలించే ప్రక్రియ అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏళ్లు గడుస్తున్నా లక్నవరం ప్రాంత రైతుల ఆశలు కలగానే మిగిలిపోతున్నాయి.
రామప్ప నుంచి పంప్‌హౌస్ వరకు నిర్మించిన కాలువ
ములుగు, న్యూస్‌టుడే: దేవాదుల నీటిని రామప్ప నుంచి లక్నవరం చెరువులోకి తరలించే ప్రక్రియ అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏళ్లు గడుస్తున్నా లక్నవరం ప్రాంత రైతుల ఆశలు కలగానే మిగిలిపోతున్నాయి. రామప్ప చెరువును రిజర్వాయర్‌గా నిర్ధారించి దేవాదుల నీటిని పైపులైన్ ద్వారా రామప్ప చెరువులోకి తరలించి ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు కాల్వలు, పైపులైన్ ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే రామప్ప నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు నీరు తరలిపోతోంది. కానీ ములుగు జిల్లా ప్రజలకు చుక్క నీరు అందడం లేదు. ఇక్కడి నుంచే సొరంగ మార్గం ద్వారా హనుమకొండ, జనగామ జిల్లాలకు తరలించేందుకు పనులు జరుగుతున్నాయి. ఇంత వరకు బాగానే ఉంది. ఏళ్లు గడుస్తున్నా రామప్ప నుంచి లక్నవరం సరస్సులోకి నీటిని తరలించే ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. ఈ ప్రక్రియ ప్రతిపాదనలకే పరిమితం అయింది.
ఆర్థిక శాఖ వద్ద 8 నెలలుగా..
రైతులకు నష్ట పరిహారం కింద చెల్లించాల్సిన నిధులు రాష్ట్ర ఆర్థిక శాఖ వద్ద ఆగిపోయాయి. కాగితాల్లో కేటాయింపు జరిగినప్పటికీ నిధులు విడుదల కాలేదు. క్లియరెన్స్ కోసం చెక్కును నీటి పారుదల శాఖ ద్వారా ప్రభుత్వానికి పంపించారు. ఆర్థిక శాఖ వద్ద చెక్కు ఆగి సుమారు 8 నెలలు కావస్తోంది. నిరీక్షణతోనే కాలం గడిచిపోతోంది. అక్కడి నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత భూ సేకరణ అధికారి ఖాతాలో నిధులు జమ కావాల్సి ఉంటుంది. అక్కడి నుంచి రైతులకు ప్రకటించిన నష్ట పరిహారం అవార్డు ప్రకారం నేరుగా రైతుల ఖాతాలో సొమ్ము జమ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఎదురుచూపులు
రైతులకు పరిహారం చెల్లింపులో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. రామప్ప నుంచి ఫీడర్ ఛానల్ ద్వారా లక్నవరం చెరువులోకి నీటిని విడుదల చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం. సుమారు 4.850 కిలోమీటర్ల పొడవునా కాల్వ తవ్వకం పనులు చేపట్టి నీటిని తరలించేందుకు నిర్ణయించారు. కొందరు రైతులు సుమారు 100 ఎకరాల భూములు కోల్పోవాల్సి వస్తోంది. ములుగు మండలంలోని కాసిందేవిపేట రెవెన్యూ గ్రామం పరిధిలో 48.30 ఎకరాలు, ఇంచెర్ల రెవెన్యూ గ్రామం పరిధిలో 52.30 ఎకరాల భూమిని కోల్పోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనరల్ అవార్డు పద్ధతిన రైతులకు పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. ఎదురుచూపులతోనే కాలం గడిచిపోతోంది.
203 మంది రైతులు.. రూ.3.73 కోట్లు
రామప్ప-లక్నవరం చెరువు వరకు కాల్వ నిర్మాణం వల్ల ములుగు మండలం కాసిందేవిపేట, ఇంచెర్ల రెవెన్యూ గ్రామాలకు చెందిన 203 రైతులు తమ భూములను కోల్పోతున్నారు. కాసిందేవిపేట పరిధిలో 54 మంది రైతులు 48.30 ఎకరాలు, ఇంచెర్ల పరిధిలో 149 రైతులు 52.30 ఎకరాలు కోల్పోతున్నారు. కాసిందేవిపేట పరిధిలోని 54 మంది రైతులకు రూ.1.20 కోట్లు, ఇంచెర్లకు చెందిన 149 మంది రైతులకు రూ. 2.53 కోట్లు పరిహారం చెల్లించాల్సి ఉంది.
ములుగు మండలం రంగారావుపల్లి వద్ద నిర్మించిన పంప్‌హౌస్
పరిహారం చెల్లిస్తేనే పనులు ముందుకు..
రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా పనులు సాగే పరిస్థిలు కనిపించడం లేదు. గతంలో ఒక సారి పనులు ప్రారంభించాలని గుత్తేదారు ప్రయత్నించినప్పటికీ తమకు పరిహారం చెల్లించేంత వరకు పనులు చేపట్టవద్దని రైతులు అభ్యంతరం తెలపడంతో పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం కాల్వ తవ్వకానికి అనుకూలంగా ఉన్న వేసవి సీజన్ కూడా గడిచిపోతోంది. పనులు ప్రారంభం కావాలంటే మరో ఏడాది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
నిధులు వచ్చాకే ప్రారంభం..: కృష్ణఆదిత్య, కలెక్టర్
2020లో అవార్డు పాస్ చేశాం. బిల్లులు కూడా అందించాం. టోకెన్‌లు క్లియర్ కావాల్సి ఉంది. ఇది ఆర్థిక శాఖ పరిధిలో ఉంది. నీటి పారుదల శాఖకు టోకెన్‌లు అందించాం. డబ్బులు వచ్చిన తర్వాత భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేస్తాం. ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చి, నీటిపారుదల శాఖ నుంచి నిధులు జమ అయిన తర్వాత నీటి పారుదల శాఖకు భూమిని అప్పగిస్తాం. రైతులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే పనులు ప్రారంభమవుతాయి.
కాలువ తవ్వకం కోసం ప్రతిపాదించిన స్థలం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.