కాసుల గొలుసులు

జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం దాటి అదనంగా రూ.148 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. తద్వారా బీరు, బ్రాంది అమ్మకాల్లో జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది.

Updated : 13 Jun 2023 06:22 IST

అధికారుల ప్రోత్సాహంతో విచ్చలవిడిగా దుకాణాల నిర్వహణ

ఈనాడు, కామారెడ్డి:  జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం దాటి అదనంగా రూ.148 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. తద్వారా బీరు, బ్రాంది అమ్మకాల్లో జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది.
భిక్కనూరు మండలం జంగంపల్లిలోని బెల్ట్‌ దుకాణాన్ని నిర్వాహకులు రూ.19.85 లక్షలకు వేలం పాటలో దక్కించుకున్నారు. ఈ తతంగం అంతా ఆబ్కారీ శాఖ అధికారుల కనుసన్నల్లోనే జరిగినట్లు నిర్ధారణ అయింది. ఇదే తీరున జిల్లాలోని పలు గ్రామాల్లో గొలుసు దుకాణాలకు అధికారికంగానే వేలం పాటలు నిర్వహిస్తున్నారు.
జిల్లాలో నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపిన ఆబ్కారీ అధికారులు గొలుసు దుకాణాలను ఏర్పాటు చేసేందుకు సంపూర్ణ సహాయ, సహకారాలు అందిస్తున్నారు. ఫలితంగా పల్లెల్లో గొలుసు బంధం మరింతగా పెరుగుతోంది. ఈ దుకాణాల సంఖ్య పెంచుతూ గ్రామీణులను మత్తుతో ముంచేస్తున్నారు.

ఉద్యమించాల్సిన తరుణం

పలు ఇళ్లల్లో చిచ్చుపెడుతున్న గొలుసు దుకాణాలను రూపుమాపే దిశగా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలా గ్రామాల్లో మహిళలు పోరాటం సాగిస్తున్నారు. కలిసికట్టుగా ఆందోళనలతో ప్రజల్ని చైతన్యం చేస్తున్నారు. బెల్ట్‌ దుకాణాలతో విసుగు చెందిన పలు పల్లెల వారు సంఘటితమై మద్యం విక్రయాలను నిషేధిస్తూ తీర్మానాలు చేస్తున్నారు. ఇటీవల కామారెడ్డి గ్రామీణ మండలం సరంపల్లిలో ఈ విధంగా చర్యలు తీసుకున్నారు.

మామూళ్ల మత్తులో

ఆబ్కారీ, పోలీసు శాఖల అధికారులకు మద్యం దుకాణాల నుంచి ప్రతినెలా రూ.20 - 30 వేల వరకు మామూళ్ల రూపంలో వెళ్తున్నాయనేది బహిరంగ రహస్యమే. అందుకే దుకాణదారులు ఎంతకు అమ్ముకున్నా, ఎన్ని గొలుసులు నిర్వహించుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సమయ పాలనను పర్యవేక్షించడం లేదు. జిల్లాకేంద్రం శివారులోని మద్యం దుకాణాలు నిత్యం ఉదయం 10 గంటలకు ముందే తెరుస్తున్నా కన్నెత్తి చూడటం లేదు.

ధర తగ్గించినా..

ఇటీవల ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించినప్పటికీ జిల్లాకేంద్రంలోని కొన్ని దుకాణాల నిర్వాహకులు పాత ధరలకే విక్రయాలు సాగిస్తున్నారు. ఈ దందా ఆబ్కారీ శాఖ అధికారులకు తెలిసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు.

ఒత్తిడి పేరుతో..

ఆబ్కారీ శాఖలోని ఓ ఉన్నతస్థాయి అధికారే స్వయంగా వ్యవహారాలను చక్కబెడుతున్నారనే విమర్శలున్నాయి. ‘మీకు తెలిసిందేగా.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడపడితే అక్కడే బెల్టు దుకాణాలు ఉంటున్నాయి. మద్యం విక్రయాలు పెంచాలనే ఒత్తిడి మాపై ఉంది’ అని ఆబ్కారీ శాఖవారు అనధికారికంగా పేర్కొంటున్నారు.

బాహాటంగానే విక్రయాలు

పేరుకు మద్యం దుకాణాలున్నా వ్యాపారమంతా గ్రామాల్లోని ‘గొలుసు’ల్లోనే సాగుతోంది. ఒక్కోచోట కనిష్ఠంగా 3.. గరిష్ఠంగా 15కు పైగా ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. అమ్మకం ధరను మించి రూ.10 - 30 వరకు వసూలు చేస్తున్నారు. మాచారెడ్డి, రాజంపేట, భిక్కనూరు మండలాల్లో మద్యం వ్యాపారులే బెల్ట్‌ దుకాణాలు నడిపిస్తున్నారు. ఇటీవల మాచారెడ్డి మండల కేంద్రంలోని ఓ దుకాణంలో నిల్వలు లేవనే సాకుతో విక్రయాలు నిలిపివేశారు. స్థానికంగా ఉన్న ‘గొలుసు’లో మాత్రం అధిక ధరలకు విక్రయాలు కొనసాగించారు.

ఆర్థికంగా చితికిపోతున్న పేదలు

గొలుసు దుకాణాలు అందుబాటులో ఉండటంతో.. పేదలు కాయకష్టం చేసుకుని సంపాదించిన సొమ్మును మద్యం కోసమే వెచ్చిస్తున్నారు. ఫలితంగా పలు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. గ్రామాల్లో తాగి ఘర్షణలకు దిగడం సాధారణంగా మారింది. మద్యం మత్తులో కుటుంబ సభ్యులనే మట్టుబెడుతున్న ఘటనలు జిల్లాలో ఇటీవల అనేకం చోటుచేసుకుంటున్నాయి. యువత తాగుడుకు అలవాటు పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని