పేగుబంధం కాకపోయినా...ప్రేమగా చూసుకుంటూ...

పేగుతెంచుకుని పుట్టిన వాళ్లు పట్టనట్లు వదిలేశారు. అయిన వాళ్లెవరూ ఆ దరిదాపులకు రావడం మానేశారు. దాంతో అందరూ ఉన్నా అనాథగా మరిందా వృద్ధురాలు. ఒంటరిగా కాలం వెళ్లదీస్తున్న  ఆమెను..ఓ ప్రమాదం అచేతనంగా మార్చేసింది

Published : 29 Oct 2020 01:49 IST


ఇంటర్నెట్‌ డెస్క్ ‌: పేగు తెంచుకుని పుట్టిన వాళ్లు పట్టనట్లు వదిలేశారు. అయిన వాళ్లెవరూ ఆ దరిదాపులకు రావడం మానేశారు. దాంతో అందరూ ఉన్నా అనాథగా మరిందా వృద్ధురాలు. ఒంటరిగా కాలం వెళ్లదీస్తున్న  ఆమెను..ఓ ప్రమాదం అచేతనంగా మార్చేసింది. సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఓ మానవతామూర్తి ఆమె పట్ల కరుణ చూపారు. రక్త సంబంధం లేకపోయినా ఆదరాభిమానాలు చాటుతున్నారు. వివరాల్లోకి వెళితే...సుంకులమ్మ అనే వృద్ధురాలిది కర్నూలు జిల్లా , ఓర్వకల్లు మండలంలోని కాల్వ గ్రామం. ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. ఆమె చిన్నకుమారుడు అనారోగ్యంతో మృతిచెందాడు. ఆస్తి పంచివ్వలేదని పెద్దకుమారుడు, కుమార్తె సుంకులమ్మతో మాట్లాడటం మానేశారు. దాంతో అందరూ ఉన్నా అనాథగా మారిందామె. పొట్టకూటి కోసం పొరుగూరు బ్రాహ్మణపల్లిలో కూరగాయలు, పండ్లు అమ్మేది.

ఓ రోజు బస్సు దిగుతూ కిందపడింది. ఈ ప్రమాదంలో ఆమెకు కాలు విరిగింది. ఆ సమయంలో అదే మార్గంలో వెళ్తున్న బాలరాజు అనే వ్యక్తి ఆమెకు వైద్యం చేయించారు. కాలుకు కట్టు కట్టించారు. ప్రమాదం గురించి ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అయితే వారి నుంచి స్పందన కరవైంది. ఇంకెప్పుడు ఫోన్‌ చేయవద్దని ఆయనకు తెగేసి చెప్పారు. దాంతో ఏంచేయాలో ఆయనకు పాలుపోలేదు. ఇక సుంకులమ్మ సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు. బస్‌షెల్టర్‌లోనే ఆమె ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. సమయానికి భోజనం, మందులు అందిస్తూ ఆదరువుగా ఉంటున్నారు. బాలరాజు చేస్తున్న సేవను గ్రామస్థులు కొనియాడుతున్నారు. స్థానిక నేతలు సైతం అతడికి అండగా నిలుస్తున్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని