Higher Pension: అధిక పింఛను దరఖాస్తు గడువు పొడిగింపు

ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చే వేతనజీవులకు అధిక పింఛనుకు ఉమ్మడి ఆప్షన్‌ దరఖాస్తు గడువు పొడిగింపుపై ఎట్టకేలకు నిర్ణయం వెలువడింది. ఈ నెల 3వ తేదీతో ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు ముగియనుండగా.. దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్టు ఈపీఎఫ్‌ఓ వెల్లడించింది.

Published : 02 May 2023 22:04 IST

హైదరాబాద్‌: ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చే వేతనజీవులకు అధిక పింఛనుకు ఉమ్మడి ఆప్షన్‌ దరఖాస్తు గడువు పొడిగింపుపై ఎట్టకేలకు నిర్ణయం వెలువడింది. ఈ నెల 3వ తేదీతో ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు ముగియనుండగా.. దరఖాస్తు గడువును జూన్ 26 వరకు పొడిగిస్తున్నట్టు ఈపీఎఫ్‌ఓ వెల్లడించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు సాంకేతిక అడ్డంకులు, కచ్చితంగా జత చేయాల్సిన ఈపీఎఫ్‌వో పాస్‌బుక్‌కు సర్వర్‌ మొరాయించడం తదితర కారణాలతో అర్హులైన పింఛనుదారులు, కార్మికులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. అధిక పింఛను దరఖాస్తు గడువు పొడిగించాలని పింఛనుదారులు, కార్మికులు, కార్మిక సంఘాల నేతలు, సీబీటీ సభ్యులు ఈపీఎఫ్‌వో కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈనేపథ్యంలో ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకునేందుకు వేతన జీవులకు జూన్‌ 26కు ఈపీఎఫ్‌వో అవకాశం కల్పించింది. 

2014కు ముందు సర్వీసులో చేరి, ఆ తరువాత కొనసాగుతూ వాస్తవిక వేతనం (ఈపీఎఫ్‌వో గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేలకన్నా ఎక్కువ)పై ఈపీఎఫ్‌ చందా చెల్లిస్తున్న కార్మికులు, పింఛనుదారులు అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ మేరకు ఫిబ్రవరిలో మార్గదర్శకాలు జారీ చేసిన ఈపీఎఫ్‌వో మే 3వ తేదీలోగా ఆన్‌లైన్లో ఉమ్మడి ఆప్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలంది. దరఖాస్తులో పలు సాంకేతిక సమస్యలతో చందాదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అధిక పింఛను దరఖాస్తులో కీలకమైన పేరా 26(6) కింద వాస్తవిక వేతనంపై ఈపీఎఫ్‌ చందా చెల్లించేందుకు ఈపీఎఫ్‌వో అనుమతిపత్రం జత చేయాల్సి ఉంటుంది. ఈ పత్రాన్ని యాజమాన్యాల నుంచి తీసుకునేందుకు కార్మికులకు జాప్యం జరిగింది. ఈపీఎఫ్‌వో పాస్‌బుక్‌ను కచ్చితంగా దరఖాస్తుతో పాటు జతచేయాలి. అయితే ఏప్రిల్‌లో ఈపీఎఫ్‌వో పాస్‌బుక్‌ సర్వర్‌ పనిచేయలేదు. పాస్‌బుక్‌ అప్‌డేట్‌ పేరిట సర్వర్‌ నిలిచిపోయింది. పింఛనుదారులకు పేరులో అక్షర పొరపాట్లు, పీపీవో ఆధార్‌ అనుసంధానం కాకపోవడం తదితర కారణాలతో దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఉమ్మడి ఆప్షన్‌ దరఖాస్తుకు 4 నెలల గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులో సూచించింది. అయితే ఈపీఎఫ్‌వో 2 నెలల గడువు ఇచ్చింది. అర్హులైన కార్మికులు, పింఛనుదారులు దరఖాస్తు చేసుకునేందుకు మరో 2 నెలల గడువు ఇవ్వాలని ఇప్పటికే పలు కార్మిక సంఘాలు కేంద్ర కార్యాలయానికి విజ్ఞప్తి చేశాయి. ఈ తరుణంలో జూన్‌ 26వరకు గడువు పొడిగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని