Updated : 20 Oct 2020 12:24 IST

ఎముక పుష్టిగా.. !

నేడు ప్రపంచ ఆర్టియోపొరోసిస్‌ దినం

శరీరాన్ని నిలబెట్టేవి ఎముకలే. ఇవి బలంగా ఉంటేనే నిటారుగా నిలుస్తాం. ఎంత దూరమైనా వేగంగా నడిచేస్తాం. పెద్ద బరువులనైనా అలవోకగా ఎత్తేస్తాం. అదే ఎముకలు బలహీనపడితే? లోపలంతా చెదలు పట్టినట్టుగా బోలుబోలుగా అయిపోతే? చిన్నపాటి కుదుపులకే పుటుక్కున విరిగిపోతాయి. సరిగా అతుక్కోవు కూడా. ఆస్టియోపొరోసిస్‌ ఇలాంటి చిక్కులే తెచ్చిపెడుతుంది. 
ఆస్టియోపొరోసిస్‌ ‘అదృశ్య’ సమస్య. తొలిసారి ఎముక విరిగేంతవరకూ ఎలాంటి లక్షణాలూ కనిపించవు. దీని మూలంగా మనదేశంలో ఏటా సుమారు కోటి మంది ఎముకలు విరిగిపోయి బాధపడుతున్నారు! ఇంతకీ ఆస్టియోపోరోసిస్‌ అంటే ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే ఎముకలు గుల్లబారటం. ఎముకల చేవ తగ్గిపోయి, దృఢత్వం కోల్పోయి.. బోలుబోలుగా బలహీనంగా అయిపోవటం. దీనికి మూలం ఎముక కణజాలం సాంద్రత తగ్గుముఖం పట్టటం. దీని బారినపడ్డవారిలో మామూలుగా కిందపడినా పుటుక్కున ఎముకలు విరిగిపోతుంటాయి. కొందరిలో దగ్గు, తుమ్ము, హఠాత్తుగా పక్కలకు తిరగటం వంటి వాటితో తలెత్తే కుదుపులనూ ఎముకలు తట్టుకోలేవు. అంత బలహీనంగా మారిపోతాయి. ఆస్టియోపొరోసిస్‌లో తరచూ తుంటి, మణికట్టు, వెన్నెముక వంటివి విరగటం చూస్తుంటాం. అందుకే దీనిపై అవగాహన కలిగుండటం అవసరం.
ముప్పును ఇలా అంచనా వేసుకోండి..
ఎముకలు గుల్లబారటం వయసుతో ముడిపడిన సమస్య. దీనికి  రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. వీటిని అంచనా వేయటం ద్వారా ముప్పును అంచనా వేసుకోవచ్చు.
- అరవై ఏళ్లు దాటాయా?
వయసుతో పాటు ఎముకలు గుల్లబారే ముప్పూ పెరుగుతూ వస్తుంది. ఇతరత్రా జబ్బుల వంటి ముప్పు కారకాలేవీ లేకపోయినా 60 ఏళ్లు పైబడ్డ మహిళలకు, 70 ఏళ్లు పైబడ్డ పురుషులకు దీని ముప్పు మరింత ఎక్కువ. 65 ఏళ్లు దాటిన మహిళల్లో దాదాపు 85% మంది ఎముకలు గుల్లబారటంతో బాధపడుతున్నారని అంచనా. దీంతో తుంటి ఎముక విరిగిపోయి, చికిత్స తీసుకున్నా కూడా మహిళల్లో 10-20% మంది తొలి ఏడాదిలోనే మృత్యువాత పడుతున్నారు. ఏడాది కన్నా ఎక్కువకాలం జీవించినా 50% మంది పూర్తిగా మంచానికే పరిమితమైపోతున్నారు. అందుకే వృద్ధులు ఎముకల దృఢత్వాన్ని తరచూ పరీక్షించుకోవటం మంచిది.
- 50 ఏళ్లు దాటాక ఎముక ఎప్పుడైనా విరిగిందా?
కిందపడినప్పుడు మామూలు గాయమైనా కూడా ఎముక విరిగినట్టయితే ఎముకలు గుల్లబారటానికి సంకేతం కావొచ్చు. ఒకసారి ఎముక విరిగితే మరోసారి విరిగే ముప్పు పెరుగుతుంది. వచ్చే రెండేళ్లలో మరోసారి ఎముక విరిగే ప్రమాదముంటుంది.
- బరువు తక్కువగా ఉన్నారా?
శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (బీఎంఐ) 19 కన్నా తక్కువగా ఉన్నట్టయితే ఎముకలు గుల్లబారే ముప్పు పొంచి ఉన్నట్టే. ఉండాల్సిన దాని కన్నా బరువు తగ్గినట్టయితే చిన్నవయసు స్త్రీలల్లోనూ నెలసరి నిలిచిపోయినవారిలో మాదిరిగా ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ స్థాయులు పడిపోతాయి. ఇది ఎముకలు గుల్లబారటానికి దారితీస్తుంది. బలహీనంగా ఉన్నవారికి ఎముకలు విరిగిపోయే అవకాశమూ ఎక్కువే.
- పొడవు తగ్గారా?
40 ఏళ్లు దాటిన తర్వాత కురచగా అయిపోవటం మరో సూచన. ఎవరైనా 1.5 అంగుళాలకు మించి పొడవు తగ్గితే జాగ్రత్త పడాల్సిందే. దీనికి మూలం వెన్నెముక బలహీన పడినచోట నలిగిపోయి, పగుళ్లు పడటం. ఇందులో కొన్నిసార్లు నొప్పేమీ ఉండకపోవచ్చు. చాలామందికి ఆ విషయమే తెలియకపోవచ్చు. 
- తల్లిదండ్రుల్లో ఎవరికైనా తుంటి విరిగిందా?
ఎముకలు గుల్లబారే స్వభావం కొందరికి తల్లిదండ్రుల నుంచీ సంక్రమిస్తుంటుంది. అందువల్ల తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఎముకలు గుల్లబారటం, మెడ బాగా ముందుకు వంగిపోవటం, తుంటి విరగటం వంటి సమస్యలున్నట్టు గుర్తిస్తే మరింత జాగ్రత్త అవసరం. ఇలాంటి వారి సంతానానికి ఎముకలు గుల్లబారే ముప్పు ఎక్కువ.
- జబ్బులేవైనా ఉన్నాయా?
కీళ్లవాతం, ప్రొస్టేట్‌ లేదా రొమ్ముక్యాన్సర్‌, మధుమేహం, దీర్ఘకాల కిడ్నీ జబ్బు, థైరాయిడ్‌ సమస్యలు, సీవోపీడీ, టెస్టోస్టిరాన్‌ స్థాయులు తగ్గటం, త్వరగా నెలసరి నిలిచిపోవటం, అండాశయాలు తొలగించాల్సి రావటం, దీర్ఘకాలం కదల్లేని స్థితిలో ఉండటం, హెచ్‌ఐవీ, పేగుల్లో పూత, సిలియాక్‌ డిసీజ్‌ వంటి జీర్ణకోశ సమస్యలు.. ఇలాంటివన్నీ ఎముకలు గుల్లబారే ముప్పు పెరగటానికి దోహదం చేస్తాయి. వీటిల్లో కొన్ని జబ్బులు తూలి పడిపోయే ముప్పును పెంచుతూ, ఎముకలు విరగటానికి దారితీస్తాయి.
- మందులేవైనా వేసుకుంటున్నారా?
వాపు ప్రక్రియను తగ్గించటానికిచ్చే స్టిరాయిడ్లు, రొమ్ముక్యాన్సర్‌ చికిత్సలో వాడే అరోమటేజ్‌ ఇన్‌హిబిటార్లు, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ బాధితుల్లో సెక్స్‌ హార్మోన్ల మోతాదులు తగ్గటానికి చేసే చికిత్స, మధుమేహులు వేసుకునే థియాజోలిడినెడయోన్లు, అవయవ మార్పిడి చేసినవారికిచ్చే రోగనిరోధకశక్తిని అణచిపెట్టే మందులు, కొన్ని కుంగుబాటు మందులు, కొన్నిరకాల మూర్ఛ మందులు సైతం ఎముకలు గుల్లబారే ముప్పును పెంచొచ్చు. వీటిని దీర్ఘకాలంగా వాడేవారిలో ఎముక క్షీణించే వేగం పెరగొచ్చు.
- పొగ, మద్యం అలవాట్లున్నాయా?
అతిగా మద్యం తాగటం ఎముకలపై విపరీత ప్రభావం చూపుతుంది. మద్యం మత్తులో తరచూ తూలి పడిపోవటం మూలంగానూ ఎముకలు విరగొచ్చు. సిగరెట్లు, బీడీలు, చుట్టల వంటివి తాగటమూ ఎముకలు గుల్లబారే ముప్పును పెంచుతాయి.

 

నివారణ మార్గముంది
ఎముకలు బలహీనపడటం ఉన్నట్టుండి మీద పడేది కాదు. దీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తుంది. ముందుగా మేల్కొంటే ఆస్టియోపొరోసిస్‌ ముప్పును తగ్గించుకోవచ్చు. ఎముకలు దృఢంగా ఉండేలా చూసుకోవచ్చు.
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ముఖ్యం. బరువులు ఎత్తే, కండరాలను బలోపేతం చేసే, శరీర నియంత్రణకు తోడ్పడే వ్యాయామాలు మేలు చేస్తాయి. 
* ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం, విటమిన్‌ డి, ప్రొటీన్‌ అత్యవసరం. పాలు, పెరుగు, మజ్జిగ వంటి వాటితో క్యాల్షియం లభిస్తుంది. రోజూ కాసేపు ఒంటికి ఎండ తగిలేలా చూసుకుంటే విటమిన్‌ డిని పొందొచ్చు.
* బరువు అదుపులో ఉంచుకోవటం మంచిది. అలాగే మద్యం అతిగా తాగకుండా చూసుకోవాలి. పొగ అలవాటుంటే వెంటనే మానెయ్యాలి.
* ఎముకలు గుల్లబారటానికి  దోహదం చేసే కారకాలను గుర్తిస్తే డాక్టర్ల దృష్టికి తీసుకెళ్లాలి. ముఖ్యంగా గతంలో ఎముకలు విరగటం, జబ్బులు, వేసుకునే మందుల గురించి వివరించాలి.
* అవసరమైతే ఎముక సాంద్రతను తెలిపే డెక్సా స్కాన్‌ పరీక్ష చేయించుకోవాలి. ఆస్టియోపొరోసిస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయితే కనీసం 2-3 సంవత్సరాల పాటు చికిత్స తీసుకోవాలి. 

 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని