Smartphone Vision Syndrome: చీకట్లో స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా..? కంటి చూపుపై ఎఫెక్ట్‌

తాజాగా నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ఎస్‌వీఎస్‌ (SVS) లేదా సీవీఎస్‌ (CVS) కారణంగా కంటి చూపు లోపం తలెత్తున్న వారిలో 66 శాతం మంది మహిళలే ఉంటున్నారట. ఈ క్రమంలో మితిమీరిన స్మార్ట్‌ఫోన్‌ (Smartphone) వినియోగంతో ఓ మహిళ కంటి చూపు కోల్పోయే ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది.

Published : 10 Feb 2023 01:32 IST

హైదరాబాద్‌: స్మార్ట్‌ఫోన్‌ (Smartphone) చేతిలో ఉంటే చాలు.. ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి ఎడ్యుకేషన్‌ వరకు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ నుంచి ఆఫీస్‌ పనిదాకా.. ఎక్కడి నుంచైనా పని పూర్తి చేయొచ్చు. దీంతో రోజులో ఎక్కువ సమయంలో స్మార్ట్‌ఫోన్‌తో గడిపే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో అనేక మంది స్మార్ట్‌ఫోన్‌ సంబంధిత జబ్బుల బారిన పడుతున్నారు. మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం వల్ల కంటి చూపు (Eye Sight) కోల్పోయే ప్రమాదం ఉందని  తాజాగా జరిగిన ఘటన స్పష్టం చేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో న్యూరాలజిస్ట్‌ (Neurologist)గా పనిచేస్తున్న డాక్టర్‌ సుధీర్‌ తన ట్విటర్‌ థ్రెడ్‌లో వివరించారు. 

ఇదీ సమస్య

హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల గృహిణి ఏడాదిన్నరగా తనకు కళ్లు సరిగా కనిపించడంలేదని డాక్టర్‌ను సంప్రదించింది. గతంలో బ్యూటీషియన్‌గా పనిచేసిన ఆమె, దివ్యాంగుడైన తన కుమారుడి కోసం ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టింది. ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండటంతో ఖాళీ సమయాల్లో స్మార్ట్‌ఫోన్ చూడటం అలవాటైంది. అలా రోజులో ఫోన్‌ వినియోగించే సమయం క్రమంగా పెరిగింది. రాత్రిపూట ఇంట్లో లైట్ ఆఫ్‌ చేసిన తర్వాత ఫోన్‌ చూస్తుండేది. అదేపనిగా చీకట్లో మొబైల్ స్క్రీన్‌ను చూస్తుడటంతో కొద్ది రోజులకు ఆమెకు కంటి చూపులో సమస్యలు ప్రారంభమయ్యాయి. 

రోజులో కొన్ని సెకన్లపాటు కళ్లు కనిపించకపోవడం, ప్రకాశవంతమైన కాంతిని చూడలేకపోవడం, వస్తువులు బ్లర్‌గా కనిపించడం వంటి సమస్యలు ఎక్కువ కావడంతో కంటి డాక్టర్‌ను సంప్రదించింది. పరీక్షల అనంతం ఎలాంటి లోపం గుర్తించకపోవడంతో న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలని సూచించారు. దీంతో ఆమె డాక్టర్‌ సుధీర్‌ను సంప్రదించినట్లు తెలిపారు. కొన్ని పరీక్షలు చేసిన తర్వాత ఆమె స్మార్ట్‌ఫోన్ విజన్‌ సిండ్రోమ్ (SVS) అనే వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. 

వ్యాధి నివారణ ఇలా..

ఈ వ్యాధి నుంచి ఆమె బయటపడేందుకు ఎలాంటి మందులు వాడమని చెప్పలేదు. కౌన్సిలింగ్‌ నిర్వహించి..అత్యవసరమైతే తప్ప స్మార్ట్‌ఫోన్ ఉపయోగించవద్దని ఆమెకు సూచించారు. దీంతో ఆమె కొంత కాలంపాటు స్మార్ట్‌ఫోన్‌ వినియోగాన్ని తగ్గించింది. మళ్లీ నెలరోజుల తర్వాత డాక్టర్‌ వద్దకు వచ్చిన ఆమెకు కంటి సమస్య పూర్తిగా తగ్గిపోయినట్లు పరీక్షల్లో తేలింది. జీవనశైలి (Lifestyle)లో చిన్నపాటి మార్పులతో 18 నెలలుగా ఆమెను వేధిస్తున్న సమస్య నుంచి బయటపడింది. 

డాక్టర్‌ సలహా

ఇటీవలి కాలంలో ఎక్కువ మంది ఉద్యోగులు, గృహిణులు స్మార్ట్‌ఫోన్‌ విజన్‌ సిండ్రోమ్‌ (SVS), కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ (CVS) బారిన పడుతున్నారట. తాజాగా నిర్వహించిన ఓ సర్వే ప్రకారం సీవీఎస్‌ బారిన పడుతున్న వారిలో 66 శాతం మహిళలే ఉంటున్నారట. ఈ సమస్యలకు డాక్టర్‌ కొన్ని సూచనలు చేశారు. 

  • ఎక్కువ సమయం అదేపనిగా డిజిటల్‌ స్క్రీన్‌ను చూడొద్దని సూచిస్తున్నారు. ఈ అలవాటు వల్ల దృష్టి లోపం తలెత్తవచ్చు. 
  • రోజులో ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ చూసేవారు తప్పనిసరిగా 20-20-20 నియమాన్ని పాటించాలి. ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్ల విరామం తీసుకుని 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను చూడాలి. 
  • రాత్రిపూట చీకట్లో మొబైల్‌ స్క్రీన్‌ను అత్యవసరమైతే తప్ప చూడొద్దని సూచించారు. దీనివల్ల ఎక్కువ మందిలో కంటి చూపు తగ్గిపోతుందని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని