Viveka Murder case: నన్ను, నా కుటుంబాన్ని ఏమైనా చేస్తారేమో.. రక్షణ కల్పించండి: దస్తగిరి

వైఎస్‌ భాస్కరరెడ్డి అరెస్టు అయిన తర్వాత ఆయన కుమారుడు, ఎంపీ అవినాష్‌ అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తెలిపారు. వారి నుంచి రక్షణ కల్పించాలంటూ కడప ఎస్పీకి ఆయన ఫిర్యాదు చేశారు.

Updated : 19 Apr 2023 16:44 IST

కడప: ఎంపీ అవినాష్‌ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి అరెస్టు తర్వాత తనపై కక్ష కట్టారని మాజీ మంత్రి వైఎస్‌  వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తెలిపారు. ఈ మేరకు కడప ఎస్పీ కార్యాలయంలో ఆయన ఫిర్యాదు చేశారు. ‘‘పులివెందుల వైకాపా శ్రేణులు, అవినాష్‌ అనుచరుల నుంచి నాకు ప్రాణహాని ఉంది. నన్ను, నా కుటుంబాన్ని ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది. సీఎం జగన్‌, ఎంపీ అవినాష్‌రెడ్డి వల్ల ప్రాణహాని ఉంది. అవినాష్ రెడ్డి అనుచరులు నన్ను అనుసరిస్తున్నారు. వారు నాపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. నాకు, నా కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలి’’ అని ఫిర్యాదులో దస్తగిరి పేర్కొన్నారు. 

తాను సునీత వద్ద డబ్బులు తీసుకున్నట్టు  అవినాష్‌రెడ్డి పదే పదే ఆరోపిస్తున్నారని దస్తగరి అన్నారు. అమ్ముడుపోయానని నిరూపిస్తే జైలు శిక్షకు తాను సిద్ధమని.. నిరూపించకుంటే పదవికి రాజీనామా చేసి జైలుకెళ్తారా? అని సవాల్‌ విసిరారు. వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ ఎలా జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. దస్తగిరి ఎస్పీ కార్యాలయానికి వచ్చినప్పుడు ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో అక్కడున్న సిబ్బందికి వినతిపత్రం ఇచ్చారు. తనకు ప్రాణ హాని ఉందని సీబీఐ ఎస్పీ, కడప ఎస్పీ, రాయలసీమ రేంజ్‌ డీఐజీకి రిజిస్టర్‌ పోస్టు ద్వారా వినతులు అందజేస్తానని దస్తగిరి చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని