ప్రోత్సాహకాలతో టీకా ప్రక్రియ వేగవంతం! 

వేగంగా కొవిడ్‌ వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం ఒక ఎత్తయితే, ఇప్పుడు వాటిని ప్రపంచంలోని జనాభాకంతటికీ అందించడం సవాళ్లతో కూడుకుంది. వ్యాక్సిన్ల ఉత్పత్తి, పంపిణీకి కావాల్సిన ఏర్పాట్లు చేయడం, అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్‌ను తీసుకునేలా చేయడం అత్యవసరం

Published : 03 Aug 2021 23:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వేగంగా కొవిడ్‌ వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం ఒక ఎత్తయితే, ఇప్పుడు వాటిని ప్రపంచంలోని జనాభాకంతటికీ అందించడం సవాళ్లతో కూడుకున్న అంశం. వ్యాక్సిన్ల ఉత్పత్తి, పంపిణీకి కావాల్సిన ఏర్పాట్లు చేయడం, అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్‌ను తీసుకునేలా చేయడం అత్యవసరం. వ్యాక్సిన్లపై నమ్మకం కలుగజేయడం చాలా ప్రధానం. ప్రభుత్వం వీటి వల్ల కలిగే లాభాలను ప్రజలకు విడమరచి చెప్పి, అందరినీ ఒప్పించాలి. వ్యాక్సిన్లను తీవ్రంగా వ్యతిరేకించేవారు కొద్దిమంది ఉంటారు. కానీ మరికొందరిలో వ్యాక్సిన్లపై సందేహాలు ఉండి, తీసుకునేందుకు ముందుకు రాకపోవచ్చు. అందువల్ల సాధారణ ప్రజల్లో వ్యాక్సిన్ల వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తూ బాగా ప్రచారం చేయాలి. దీనికి తోడు వ్యాక్సిన్లు తీసుకునేవారికి ప్రోత్సాహకాలు అందివ్వాలి. ఇప్పటికే బ్రిటన్‌, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం వ్యాక్సిన్లు తీసుకుంటున్నవారికి ఇన్సెంటివ్‌లు ఇస్తున్నారు. అవేమిటో చూద్దాం..

బ్రిటన్‌, ఫ్రాన్స్‌, అమెరికా తదితర దేశాల్లో వ్యాక్సినేషన్‌!
జులై 31 నాటికి 18 ఏళ్లకు పైబడినవారిలో 89 శాతం మందికి  మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ను బ్రిటన్‌లో ఇచ్చారు. అదే వయస్కుల్లో 72 శాతం మందికి దేశవ్యాప్తంగా రెండో డోస్‌ కూడా పూర్తి చేశారు.  8.5 కోట్ల కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులను బ్రిటన్‌లో ఇంతవరకూ పూర్తి చేశారు. ఇప్పుడు మిగిలినవారికి కూడా వ్యాక్సిన్లు ఇచ్చేందుకోసం ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఆ దేశంలో పనిచేసే వ్యాపారసంస్థలు వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టడంలో ప్రభుత్వానికి తోడయ్యాయి. ఉబెర్‌, బోల్ట్‌, డెలివెరో తదితర సంస్థలు వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న ప్రజలకు ఇన్సెంటివ్స్‌ ఇస్తున్నాయి. బోల్ట్‌ సంస్థ లండన్‌లో 2.5 లక్షల పౌండ్లను వ్యాక్సిన్‌ వేయించుకునేవారిని డ్రాప్‌ చేసేందుకు ఖర్చు చేసింది. ఇంకా వోచర్లు, డిస్కౌంట్‌ కోడ్‌లు అందిస్తోంది.  పిజ్జా పిలిగ్రిమ్స్‌ అనే సంస్థ వ్యాక్సిన్లు వేయించుకున్నవారికి డిస్కౌంట్లు ప్రకటించింది.  సెర్బియా, ఇజ్రాయెల్‌, ఇటలీ, అమెరికాలోని పలు రాష్ట్రాలు కూడా ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. పారిస్‌లో కొన్ని ప్రముఖ ప్రదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరి వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు, లేదా కొవిడ్‌ నుంచి రికవరీ అయినట్టు లేదా కొవిడ్‌ నెగటివ్‌ టెస్టు రిపోర్టును ఆధారం చూపించాలని ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును చాలామంది వ్యతిరేకించారు. చాలా ప్రభుత్వాలు వ్యాక్సినేషన్‌ను తప్పకుండా వేయించుకోవాలని చట్టం తెచ్చేందుకు ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకంటే అలాంటి చట్టం వ్యక్తిగత స్వేచ్ఛకు వ్యతిరేకం. 

వ్యాక్సిన్ల వల్ల బ్రిటన్‌ సాధించిదేమంటే...
బ్రిటన్‌లో వ్యాక్సినేషన్‌ వల్ల జులై 23 నాటికి 60 వేల మరణాలను ఆపామని, 2.2 కోట్లమంది ఇన్‌ఫెక్షన్‌ బారిన పడకుండా కాపాడామని, 53 వేల మంది ఆస్పత్రి పాలవ్వకుండా చేశామని పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాండ్‌ అనే సంస్థ వెల్లడించింది.

భారతదేశంలో పరిస్థితి
ఇంతవరకూ దేశంలో 47 కోట్లమందికి వ్యాక్సినేషన్‌ అందించారు. ఇక్కడ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి టీకాలు తీసుకోవాలి. ప్రభుత్వం ఎవరినీ బలవంత పెట్టడం ఉండదు. జూన్‌లో మేఘాలయా హైకోర్టు దుకాణదారులు, ట్యాక్సి డ్రైవర్లు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని తెచ్చిన నిబంధనను సరికాదని తేల్చి చెప్పింది. ఇది ఆర్టికల్‌ 21 ప్రకారం వ్యక్తుల జీవించే హక్కుకు, స్వేచ్ఛకు భంగకరమని తెలిపింది. ఇలాంటి తరుణంలో ఇన్సెంటివ్‌లు బాగానే పనిచేస్తాయి. భారత్‌లో ఉబెర్‌ సంస్థ వ్యాక్సినేషన్‌ కేంద్రానికి ఉచితంగా తీసుకెళ్లి, తీసుకురావడం చేసింది. గత మార్చిలో పదికోట్ల రూపాయల మేరకు రైడ్స్‌ను ఉచితంగా అందించింది. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది సాధారణ ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడం గురించి అంత సానుకూలంగా లేరు. 

ప్రోత్సాహకాలు ఎందుకివ్వాలంటే...?
మనదేశంలో నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సిన్‌పై అనేక సందేహాలు ఉన్నాయి. గంటలు లేదా రోజువారీ వేతనాల ప్రకారం పనిచేసేవారికి, వ్యాక్సిన్‌ కోసం వచ్చినందువల్ల ఒకరోజు కూలీ కోల్పోతారు. కాబట్టి అలాంటివారందరికీ వ్యాక్సినేషన్‌ను ఉచితంగా అందించడమే కాకుండా, వారు కోల్పోయిన గంటలకు పరిహారంగా ఇన్నెంటివ్స్‌ ఇస్తే మేలు.  అన్నిటికంటే ప్రధానంగా మన జనాభాకు సరిపడా వ్యాక్సిన్‌ ఉత్పత్తి జరిగేలా చూడాల్సివుంటుంది. అలాగే మనదేశ వైద్యరంగంలో అందుబాటులో ఉన్న మానవ వనరులు, అందులోనూ ముఖ్యంగా నర్సింగ్‌ సిబ్బందిని‌, మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని త్వరితగతిన అందరికీ వ్యాక్సిన్‌ అందేలా చేయాలి. ఈ ఏడాది చివరికల్లా జనాభాకంతా కనీసం సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్ వేసినా ఎంతో మేలు జరుగుతుంది. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని