ఆవిష్కరణలో తెలుగు వెలుగులు

రంగు మారి, చెడిపోయిన మిర్చిని యంత్రంతో వేరు చేయడం.. సాగుకు సాంకేతికతను జోడించి దుక్కి దున్ని విత్తనం వేయడం.. కారు పొగగొట్టం నుంచి వచ్చే వేడిగాలిని శుద్ధి చేసి యంత్ర సామర్థ్యం పెంచడం..

Updated : 17 Feb 2021 12:19 IST

సాగుకు, సమాజానికి తోడ్పడే యంత్రాల సృష్టి

అమరావతి : రంగు మారి, చెడిపోయిన మిర్చిని యంత్రంతో వేరు చేయడం.. సాగుకు సాంకేతికతను జోడించి దుక్కి దున్ని విత్తనం వేయడం.. కారు పొగగొట్టం నుంచి వచ్చే వేడిగాలిని శుద్ధి చేసి యంత్ర సామర్థ్యం పెంచడం.. ఇలాఎన్నో నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు రాష్ట్రానికి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులు. సమాజానికి ఉపయోగపడే యంత్రాల రూపకల్పనకు కృషి చేస్తున్నారు.  అంతర్జాతీయ యవనికపై సత్తాచాటుతున్నారు. ఇటీవల ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ త్రీడీ సాంకేతిక సంస్థ డస్సోసిస్టమ్స్‌ ‘ప్రాజెక్టు ఆఫ్‌ ది ఇయర్‌-2020’ పేరుతో నిర్వహించిన ప్రపంచ స్థాయిలో పోటీల్లో ఉత్తమ బహుమతులు అందుకున్నారు. 

56 వేల ప్రాజెక్టులతో పోటీ..

ఆటోమోటివ్, అగ్రికల్చర్, ఏరోస్పేస్, షిప్‌ బిల్డింగ్, సివిల్‌ కన్‌స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్‌ విభాగాల్లో సాగిన డస్సోసిస్టమ్స్‌ పోటీలకు మొత్తం 56వేల ప్రాజెక్టులు రిజిస్టర్‌ చేసుకున్నాయి. ఏపీ నుంచి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, డస్సోసిస్టమ్స్‌ ద్వారా శిక్షణ పొందిన 300మంది విద్యార్థులు 148 ప్రాజెక్టులతో పోటీల్లో పాల్గొనగా.. వీటికి ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఆన్‌లైన్‌ పోల్‌ నిర్వహించారు. పోటీలో 26 ప్రాజెక్టులు ఉత్తమమైనవిగా నిలవగా.. రాష్ట్రం నుంచి 8 ప్రాజెక్టులకు స్థానం దక్కింది. 

రేసింగ్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌..

రేసింగ్‌ కోసం ఎలక్ట్రిక్‌ బైక్‌ను రూపొందించారు స్వర్ణాంధ్ర కళాశాలకు చెందిన పవన్‌ మణికంఠ. ఈ బైక్‌ను త్రీడి విధానంలో డిజైన్‌ చేశారు. వాహన వేగ సామర్థ్యాన్ని పెంచేందుకు మోటారు, వెనుక చక్రానికి మధ్య దూరాన్ని తగ్గించి, స్వింగ్‌ ఆర్మ్‌ను రూపొందించారు. సమర్థవంతమైన బ్రేకింగ్‌ కోసం వెనుక చక్రానికి హైడ్రాలిక్‌ డిస్క్‌ బ్రేక్‌ను అమర్చారు. కంబైన్డ్‌ బ్రేక్‌ సిస్టమ్‌ను ఉపయోగించారు.

చెడిపోయిన మిర్చిని వేరుచేస్తుంది.. 

రైతులు మిర్చిని ఆరబెట్టినప్పుడు చెమ్మ ఉంటే చెడిపోతాయి. కొన్ని రంగుమారిపోతాయి. ఇలాంటి వాటిని వేరుచేసేందుకు ప్రత్యేక యంత్రాన్ని రూపొందించారు విష్ణు ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు విఘ్నేష్, వివేక్, వెంకట కిరణ్, శివబాలసుబ్రహ్మణ్యం. ఈ యంత్రంలో మిర్చిని పోసేందుకు డబ్బా ఏర్పాటు చేశారు. దీనికి అనుసంధానంగా బెల్టు తిరుగుతూ ఉంటుంది. డబ్బాలో వేసిన మిర్చి, బెల్టుపై నుంచి వెళ్లే సమయంలో చెడిపోయిన వాటిని తొలగిస్తుంది. దీన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు విద్యార్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం త్రీడీలో రూపొందించారు. ఇందుకు రూ.1.50 లక్షలు వ్యయం కానున్నట్లు విఘ్నేష్‌ వెల్లడించారు.

కారు టైర్ల శక్తితో రీఛార్జి చేసేలా..

కారు నడుస్తున్నప్పుడే చక్రాల ద్వారా వచ్చే శక్తిని విద్యుత్తుశక్తిగా మార్పు చేసేలా ఎలక్ట్రిక్‌ కారును రూపొందిస్తున్నారు లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు నవీన్‌ ఇజ్జూ, మురళీకృష్ణ, రమణ నాగు, రామ్‌బ్రహ్మచారి. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఎలక్ట్రిక్‌ కారును ప్రత్యేకంగా రీఛార్జి చేయాల్సిన పని ఉండదని నవీన్‌ ఇజ్జూ వెల్లడించారు. ప్రస్తుతం కళాశాలలో ప్రయోగాలు కొనసాగిస్తున్నారు. 

దుక్కి దున్నుతూ.. విత్తనం వేస్తూ.. 

భూమిలో పదును ఉన్న సమయంలో దుక్కి దున్నుతూ విత్తనం వేసే యంత్రాన్ని శ్రీవేంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు సునీల్‌ సాయి, హేమంత్‌ ఆవిష్కరించారు. ఇది బ్యాటరీతో నడిచేలా రూపొందించారు. దీనికి ఉండే హ్యాండిల్‌ను పట్టుకొని వ్యక్తి ముందుకు వెళ్తుంటే నేలను దున్నడం, విత్తనం వేయడం, విత్తనాలపై మట్టికప్పడం చేస్తుంది.  

వేడిగాలి శుద్ధితో ఇంజిన్‌ సామర్థ్యం పెంపు..

ప్రగతి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు పూర్ణసాయి, గణేష్, సతీష్, బస్వాంత్‌లు తేలికపాటి రేస్‌ కార్‌ను తయారు చేశారు. పొగ గొట్టం నుంచి వచ్చే వేడిగాలిని శుద్ధి చేసి, ఇంజిన్‌కు అందించడం ద్వారా దాని సామర్థ్యం పెంచడం దీనిలో ప్రత్యేకత. రూ.80వేలతో దీన్ని రూపొందించారు. 

తెలిసిన డ్రైవర్‌ అయితేనే వాహనం కదిలేలా..

డ్రైవర్‌ తెలిసిన వ్యక్తి అయితేనే కారు ముందుకు కదిలే సాంకేతికతతో చిన్నపాటి రేస్‌కారును రూపొందించారు స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు గుణ మణికంఠ, సత్య జగదీష్‌. ఈ కారుకి 160సీసీ నుంచి 350సీసీ వరకు ఉండే ఇంజిన్‌లను బిగించుకోవచ్చు. జీపీస్‌ అనుసంధానమై ఉంటుంది. డ్రైవర్‌ కారులో కూర్చొని తాళం తిప్పగానే స్టీరింగ్‌ వద్దనున్న కెమెరా ద్వారా యజమాని సెల్‌ఫోన్‌కు ఫొటోతో సహా సమాచారం వెళ్లిపోతుంది. డ్రైవర్‌ తెలిసిన వ్యక్తి కాకపోతే వెంటనే ఇంజిన్‌కు వెళ్లే పవర్‌ సిస్టమ్‌ను నిలిపేయొచ్చు. దీంతో కారు నిలిచిపోతుంది. ఈ కారును కేవలం రూ.90వేలతోనే రూపొందించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని