తుమ్ము ఆపుకొంటున్నారా?

ప్రస్తుతం కరోనా పరిస్థితులలో తుమ్మినా, దగ్గినా ఇతరులు భయపడతారని చాలామంది ఆపుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు... బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే మంచికాదని కొంతమంది నమ్ముతుంటారు. ముఖ్యంగా శుభకార్యాల కోసం వెళ్లే సందర్భంలో తుమ్ము వచ్చినా కొంతమంది ఆపుకోవటానికి

Published : 18 Dec 2020 02:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత కరోనా పరిస్థితులలో తుమ్మినా, దగ్గినా ఇతరులు భయపడతారని చాలామంది ఆపుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు... బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే మంచిది కాదని కొంతమంది నమ్ముతుంటారు. ముఖ్యంగా శుభకార్యాల కోసం వెళ్లే సందర్భంలో తుమ్ము వచ్చినా కొంతమంది ఆపుకోవటానికి ప్రయత్నిస్తారు. మరి వీటిని బలవంతంగా ఆపటం సరైనదేనా? తుమ్ములు ఎందుకు వస్తాయి. ఆ వివరాలు మీకోసం...

ఋతువులు మారిన ప్రతీసారి దగ్గులు, తుమ్ములు రావటం సర్వసాధారణంగా చూస్తుంటాం. అంతేనా.. నీరు మారినా చాలామందికి జలుబు చేస్తుంది. ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లినపుడు గాలి మార్పు వల్లా కొందరికి ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఒకసారి జలుబు బారిన పడితే ఇక తుమ్ములు రావటం అది కాస్తా దగ్గుగా పరిణమించటం జరుగుతుంది. కొందరికి కొన్ని రకాల ఆహారం, వాసనలు పడకపోయినా అలర్జీ రూపంలో తుమ్ములు వస్తుంటాయి. వాస్తవానికి తుమ్ములను, దగ్గులను ఆపలేం. అయితే కొన్ని సందర్భాలలో శ్వాసను ఆపటం, ముక్కును మూయటం వంటి ప్రయత్నాలతో తుమ్మకుండా, దగ్గకుండా బలవంతంగా ఆపుతుంటారు. అయితే ఇలా చేయటం మంచిది కాదట. ఆయుర్వేదం ప్రకారం... తుమ్ములు, ఆవలింత, మూత్ర విసర్జన వంటి 13 అంశాలను అధారణీయ వేగాలు అంటారు. అంటే ఆపుకోవటానికి ప్రయత్నించకూడని విషయాలన్నమాట. కరోనా రాకతో ఎక్కువ మందిలో ఉన్నప్పుడు తుమ్ము లేదా దగ్గు వచ్చినపుడు ఆపుకోవటానికి ప్రయత్నించటం సాధారణంగా కనిపిస్తోంది. అలా చేయటం సరికాదు. తుమ్ము లేదా దగ్గు వచ్చినప్పుడు చేతిని లేదా రుమాలు అడ్డుపెట్టుకోవాలి.

తుమ్ములు ఎందుకు వస్తాయి?
మన శరీరం..గొంతు నుంచి ముక్కు వరకు ఉన్న మార్గంలో ఏదైనా అవరోధం కలగటం, పుప్పొడి రేణువులు వంటివి లోపలికి వెళ్తున్నప్పుడు వాటిని ఆపటానికి లేదా త్యజించటం కోసం తుమ్మును ప్రేరేపిస్తుంది. తుమ్ము వచ్చినపుడు ఊపిరితిత్తులలో నుంచి గంటకు 160కి.మీ వేగంతో గాలి బయటకు వస్తుంది. దీని వల్ల దుమ్ము వంటివి బయటకు పోతాయి. గాలిలో పుప్పొడి రేణువులు, సిద్ధబీజాలు వంటివి అనేకం ఉంటాయి. వీటి సైజు చాలా తక్కువగా ఉంటుంది. మనం గాలిని పీల్చుకున్నప్పుడు సులభంగా ఊపిరితిత్తులలోకి చేరగలవు. ఈ రేణువులను బయటకు పంపటం కోసం శరీరంలో మ్యూకస్‌ తయారవుతుంది. ఈ మ్యూకస్‌ ఊపిరితిత్తులలో పేరుకున్నప్పుడు దగ్గు వస్తుంది. అలా కాకుండా పైకి ఉన్నప్పుడు తుమ్ము వస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. సూర్యకిరణాలు ముక్కు మీద పడినా కూడా తుమ్ము వచ్చే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని