Godavari-kaveri: గోదావరి-కావేరి అనుసంధానంపై జలశక్తిశాఖ కీలక సమావేశం

నదుల అనుసంధానంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న కీలకమైన రెండు నదులను అనుసంధానం ..

Updated : 18 Feb 2022 20:18 IST

దిల్లీ: నదుల అనుసంధానంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న కీలకమైన రెండు నదులను అనుసంధానం చేయాలని సంకల్పించింది. మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదుల అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం తొలుత భావించించింది. అయితే, ప్రస్తుతం గోదావరి- కావేరి అనుసంధానంపై దిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ(ఎన్‌ డబ్ల్యూడీఏ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి జలశక్తిశాఖ, ఎన్‌డబ్ల్యూడీఏ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి అధికారులు హాజరయ్యారు. 237 టీఎంసీల జలాల తరలింపుపై సమావేశంలో చర్చించారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య నిధుల కేటాయింపుపై కూడా భేటీలో చర్చ జరిగింది. జాతీయ ప్రాజెక్టుల ద్వారా లబ్ధిపొందే రాష్ట్రాలు 40శాతం నిధులు భరించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న ప్రతిపాదన. అందుకు అనుగుణంగా ప్రాజెక్టు వ్యయంలో 60 శాతం నిధులు కేంద్రం భరించనుంది. నదుల అనుసంధానానికి అవసరమైన భూసేకరణ, ఏ ప్రాజెక్టు నుంచి ఏ ప్రాజెక్టుకు అనుసంధానం చేయొచ్చు... ఇవి కాకుండా ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? అనే దానిపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కాదు.. కేవలం అభిప్రాయాలు తెలుసుకోవడానికి మాత్రమేనని జలశక్తి శాఖ అధికారులు పేర్కొన్నారు. తదుపరి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు.

పోలవరం నుంచే అనుసంధానం ప్రారంభించాలి: ఏపీ
‘గోదావరిలో నీటి లభ్యత ఎంత మేరకు ఉంటుంది. ట్రైబ్యునల్స్‌ కేటాయించిన నీరు కాకుండా అదనపు జలాలు ఎంతమేర ఉంటాయి. వాటిని ఏమేరకు ఉపయోగించుకోవచ్చనే దానిపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి క్లారిటీ ఉందనే దానిపై ఒక అధ్యయనం జరగాల్సిన అవసరముంది’ అని తెలంగాణ నీటిపారుదలశాఖ అధికారులు చెప్పినట్టు సమాచారం. పోలవరం ప్రాజెక్టును ఒక ప్రాతిపదికగా తీసుకొని అక్కడి నుంచే గోదావరి-కావేరి నది అనుసంధానం ప్రారంభించాలని ఏపీ నీటి పాదరులశాఖ అధికారులు కోరినట్టు తెలిసింది. గోదావరిలో మిగులు జలాలను తరలించడం వల్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఏ ప్రాజెక్టు చేపట్టినా తమకు అభ్యంతరం లేదని తమిళనాడు, పుదుచ్చేరి అధికారులు చెప్పినట్టు జలశక్తి శాఖ వర్గాలు వెల్లడించాయి. తమకు నేరుగా జరిగే లబ్ధి ఎంతవరకు ఉంది,  నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలకు ఎలాంటి ఉపయోగం ఉంటుందనే దానిపై స్పష్టత కావాలని కర్ణాటక అధికారులు కోరినట్టు సమాచారం. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్టుపై అభిప్రాయం తెలపడానికి ఆస్కారముంటుందని చెప్పినట్టు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాలు వెల్లడించిన అభిప్రాయాలను క్రోడీకరించి తదుపరి సమావేశంలో గోదావరి-కావేరి అనుసంధానంపై డీపీఆర్‌లో మార్పులు, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని