KTR: మా తల్లిదండ్రులు ఎప్పుడూ మాకు ఆ భావన కల్పించలేదు: కేటీఆర్‌

అమ్మాయిలు, అబ్బాయిలను సమానంగా చూడాలని.. అది మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని కేటీఆర్‌ (KTR)పిలుపునిచ్చారు. ఈ విషయంలో మన ఆలోచనా విధానంలో మార్పు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Updated : 08 Mar 2023 14:34 IST

హైదరాబాద్‌: మానవ వనరులు, సాంకేతికతను వినియోగించుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌(KTR) అన్నారు. యువత ఎక్కువగా ఇంజినీర్‌, డాక్టర్‌, లాయర్‌ అవ్వాలని ఇంట్లో చెప్తారని.. వ్యాపారవేత్తలు ఎందుకు కాకూడదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌ తాజ్‌ కృష్ణా హోటల్‌లో నిర్వహించిన ‘వి హబ్‌’ 5వ వార్షికోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.

వి హబ్‌కు రూ.1.30కోట్లు ఇస్తే ఓ స్టార్టప్‌తో దాన్ని రూ.70కోట్లకు పెంచారని కేటీఆర్‌ కొనియాడారు. ఈ సందర్భంగా వి హబ్‌ ప్రతినిధులకు ఆయన అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామిక వేత్తల కోసం సింగిల్‌ విండో విధానం అమలు చేయబోతున్నామని మంత్రి చెప్పారు. మహిళలు బాధ్యతాయుతంగా ఉంటూ నిబద్ధతతో ముందుకెళ్తారని.. వారు ఏ రంగంలోనైనా రాణించగలరని కొనియాడారు.

అది మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి..

అమ్మాయిలు, అబ్బాయిలను సమానంగా చూడాలని.. అది మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే మెళకువలు నేర్పించాలన్నారు. ఈ విషయంలో మన ఆలోచనా విధానంలో మార్పు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘తెలిసో తెలియకో అమ్మాయి తక్కువ.. అబ్బాయి ఎక్కువ అనే భావన ఇంటి నుంచే నేర్పిస్తాం. పిల్లల్ని ఎలా పెంచుతాం అనేదే ముఖ్యం. మా తల్లిదండ్రులు నన్ను, నా చెల్లిని బాగా చదివించారు. నువ్వు ఎక్కువ.. తక్కువ అనేది వారు ఎప్పుడూ చూపించలేదు. నా చెల్లి యూఎస్‌ వెళ్తా అంటే నాకంటే ముందే పంపారు. మేం కూడా మా పిల్లలను సమానంగా ట్రీట్‌ చేస్తున్నాం. ఏం అవ్వాలనుకుంటే ఆ దిశగా ముందుకెళ్లాలని ప్రోత్సహిస్తున్నాం. కిందపడితే మేం ఉంటామనే ధైర్యాన్ని కల్పిస్తున్నాం. పిల్లలకు ఆ నమ్మకం ఇవ్వగలిగితే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా వందశాతం అభివృద్ధి సాధిస్తారు’’ అని కేటీఆర్‌ అన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని