KTR: సమ్మె కోసం ఆర్జీయూకేటీ విద్యార్థులు ఎంచుకున్న పద్ధతి నచ్చింది: కేటీఆర్‌

నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో గత కొంత కాలంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకుగానూ

Updated : 26 Sep 2022 18:56 IST

బాసర: నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో గత కొంత కాలంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకుగానూ విద్యార్థులతో నేరుగా మాట్లాడడానికి ఇవాళ రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ వర్సిటీ విద్యార్థులతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం ఆర్జీయూకేటీకి చేరుకున్న మంత్రులు విద్యార్థులను కలిసి వారితో మాట్లాడారు. పూర్తిస్థాయి వీసీ, బోధకులను నియమించాలని, ఇతర  డిమాండ్లను పరిష్కరించాలంటూ జూన్‌లో ఆర్జీయూకేటీ విద్యార్థులు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. జూన్‌ 20న మంత్రి సబితా హామీ మేరకు విద్యార్థులు ఆందోళన విరమించారు.

ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘డిమాండ్లు పరిష్కరించాలని మీరు చేసిన ఆందోళనలు పత్రికలు, టీవీల్లో చూశాను. రాజకీయ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా మీ అంతట మీరే ఆందోళన చేశారు. సమ్మె కోసం విద్యార్థులు ఎంచుకున్న పద్ధతి నచ్చింది. గాంధీ సత్యాగ్రహం ఎలా చేశారో.. అలానే శాంతియుతంగా సమ్మె చేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకే సమ్మె చేస్తున్నామని స్పష్టంగా చెప్పారు. ప్రజాస్వామికంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. విద్యావ్యవస్థను కొవిడ్‌ అతలాకుతలం చేసింది. భవన నిర్మాణం చేయడం తేలికైన విషయం. కానీ, అందులో వసతులు కల్పించడం, నిర్వహణ సవాల్‌తో కూడిన అంశం. సంతృప్తికర స్థాయిలో సౌకర్యాలు, వసతులు కల్పించాలని విద్యార్థులు కోరారు. రెండు నెలల తర్వాత  సబితా ఇంద్రారెడ్డిని ఇక్కడికి తీసుకొస్తా. నవంబర్‌లో అందరికీ ల్యాప్‌టాప్‌లు ఇస్తాం’’ అని కేటీఆర్‌ అన్నారు.

హాస్టల్ కష్టాలు నాకు తెలుసు..

‘‘విద్యార్థులు కింద కూర్చోవడం నాకు నచ్చలేదు. అయితే అందరం కిందనైనా కూర్చోవాలి.. లేదా పైన కూర్చోవాలి. ఇలా సగం సగం కూర్చోవడం బాగాలేదు. నవంబర్‌లో మళ్లీ వచ్చే సరికి కుర్చీలు ఏర్పాటు చేస్తాం. దానికయ్యే డబ్బును వెంటనే మంజూరు చేస్తాం. ఆడిటోరియంలో మార్పులు చేయాలని ఆదేశాలు జారీ చేస్తాం. 70 శాతం నా జీవితం హాస్టల్‌లోనే గడిచింది. హాస్టల్ కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. సమస్యలు అర్థం చేసుకొని పరిష్కరించేందుకు సమయం పడుతుంది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటాం.

ఈ సంస్థ మీదే.. మీరే కాపాడుకోవాలి..

అతి తక్కువ జనాభా ఉన్న అమెరికా నుంచి ఆకర్షించే ఉత్పత్తులు వస్తున్నాయి. అత్యంత జనాభా ఉన్న మన దేశం నుంచి ఉత్పత్తులు ఎందుకు రావడం లేదు? ఉద్యోగం చేయడం కాదు.. ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఉండాలి. ఇన్నోవేషన్ అంటే ఎవరికీ అర్థం కాని బ్రహ్మపదార్థం కాదు. విద్యార్థుల నుంచే కొత్త ఆవిష్కరణలు రావాలి. ప్రతి సంవత్సరం ఇన్నోవేషన్‌ వారోత్సవాలు ఇక్కడ జరగాలి. ఉత్పత్తిలో సత్తా ఉంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. ఐటీ, విద్యాశాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేస్తాం. క్రీడల కోసం రూ.3 కోట్లతో మినీ స్టేడియం నిర్మాణాన్ని 6 నుంచి 8 నెలల్లో పూర్తి చేస్తాం. డిజిటల్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తాం, అదనంగా 50 తరగతి గదులు ఆధునీకరిస్తాం. ఈ సంస్థ మీదే. మీరే కాపాడుకోవాలి. క్యాంపస్‌లో పరిశుభ్రత పాటించడంలో విద్యార్థులకు బాధ్యత ఉంటుంది’’ అని కేటీఆర్‌ వెల్లడించారు.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts