Rewind 2021: మహమ్మారి ‘మరణ’శాసనం..‘శతకోటి’ టీకా ప్రయాణం..అన్నదాతల ‘విజయోద్యమం’

కరోనా మహమ్మారి భయాందోళనల నడుమే కాలగమనంలో మరో ఏడాది కలిసిపోతోంది. గతేడాదిలాగే 2021లోనూ కొవిడ్‌ మిగిల్చిన చేదు జ్ఞాపకాలకు తోడు దేశంలో ఎన్నో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Updated : 29 Dec 2021 04:55 IST

ఈ ఏడాది ఎలా సాగిందంటే..

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా మహమ్మారి భయాందోళనల నడుమే కాలగమనంలో మరో ఏడాది కలిసిపోతోంది. గతేడాదిలాగే 2021లోనూ కొవిడ్‌ మిగిల్చిన చేదు జ్ఞాపకాలకు తోడు దేశంలో ఎన్నో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏడాది ఆరంభంలోనే చారిత్రక ఎర్రకోట వద్ద అన్నదాతల ఉద్యమహోరు.. యావత్‌ దేశాన్ని నివ్వెరపర్చింది. ఇక మహమ్మారి పోరులో భారత్‌ సాధించిన ‘శతకోటి’ టీకా ఘనత అంతర్జాతీయ ప్రశంసలను తెచ్చిపెట్టింది. మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ.. ఈ ఏడాది భారత్‌లో జరిగిన కీలక పరిణామాలను ఓ సారి గుర్తుచేసుకుందాం.

కరోనాకు టీకా రక్ష..

పారిశుద్ధ్య కార్మికుడికి తొలి టీకా అందిస్తున్న దృశ్యం

కరోనా మహమ్మారి కోరల నుంచి ప్రజలకు విముక్తి కల్పించేలా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి కేంద్రం ఈ ఏడాది ఆరంభంలోనే శ్రీకారం చుట్టింది. స్వదేశీ టీకాలైన కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు జారీ చేసి.. జనవరి 16 నుంచి టీకా పంపిణీని ప్రారంభించింది. తొలి దశలో ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు అందించి.. ఆ తర్వాత విడతల వారీగా వ్యాక్సినేషన్‌ను విస్తరించింది.

ఎర్రకోటపై రైతన్న జెండా..

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన రైతులు.. ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు. అయితే ఇది కాస్తా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు బ్యారికేడ్లను ధ్వంసం చేసిన రైతన్నలు చారిత్రక ఎర్రకోటను ముట్టడించారు. భద్రతా వలయాలను ఛేదించుకుని.. కోట గోడలపైకి ఎక్కి తమ జెండాలను ఎగురవేసి సంచలనం సృష్టించారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 

మహమ్మారి మిగిల్చిన మృత్యుఘోష..

ఈ ఏడాది ఆరంభంలో కరోనా రెండో దశ విజృంభణకు ప్రజలు చిగురుటాకులా వణికిపోయారు. నిత్యం లక్షల సంఖ్యలో కొత్త కేసులతో పాటు వేలాది మంది మహమ్మారికి బలయ్యారు. ఆ సమయంలో పరిస్థితి ఎంతలా దిగజారిందంటే..  కరోనా మృతులతో శ్మశానవాటికలు నిండిపోవడంతో పార్కులు, పార్కింగ్ స్థలాల్లో చితులు ఏర్పాటు చేశారు.  శ్మశాన వాటికలో అన్ని చితులూ నిరంతరం కాలుతుండడంతో అంత్యక్రియల కోసం శవాలతో బంధువులు నిరీక్షిస్తున్న దృశ్యాలు హృదయాలను కలచివేశాయి.

అందని ప్రాణవాయువు..

కరోనా రెండో దశ సమయంలో కరోనా రోగులకు ఆక్సిజన్‌ అవసరం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఆసుపత్రుల్లో చేరికలు పెరిగి పడకలు, ప్రాణవాయువు కొరత ఏర్పడింది. కొన్ని ఆసుపత్రుల్లో ఒక బెడ్‌ మీద ఇద్దరు, ముగ్గురు రోగులను ఉంచి చికిత్స అందించాల్సిన దుస్థితి తలెత్తింది. ఆక్సిజన్‌ సిలిండర్ల కోసం రోగుల బంధువులు పడిన అవస్థలు అంతా ఇంతా కాదు. 

పుట్టినింటికి ఎయిరిండియా..

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా పగ్గాలు మళ్లీ టాటా సన్స్‌ చేతికి వెళ్తున్నాయి. అప్పుల్లో కూరుకుపోయిన ఈ సంస్థలో 100 శాతం వాటా పొందేందుకు రూ.18,000 కోట్లతో టాటాలు దాఖలు చేసిన బిడ్‌కు ఈ ఏడాది అక్టోబరులో ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 89 ఏళ్ల కిందట 1932లో జేఆర్‌డీ టాటా ఈ విమానయాన సంస్థను స్థాపించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు దీన్ని జాతీయం చేశారు. దాదాపు 68 ఏళ్లుగా ప్రభుత్వ చేతిలో ఉన్న ఎయిరిండియా ఇప్పుడు మళ్లీ పూర్తిగా టాటా గ్రూప్‌ ఆధీనంలోకి వెళ్లబోతోంది.

వ్యాక్సినేషన్‌లో ‘శతకోటి’ రికార్డు..

కొవిడ్‌ టీకా పంపిణీలో భారత్‌ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశంలో జనవరి 16న మొదలైన వ్యాక్సినేషన్‌ ప్రస్థానం.. 279వ రోజున శతకోటి మైలురాయిని దాటింది. అక్టోబరు 21న దేశంలో టీకా పంపిణీ 100కోట్ల డోసులను దాటి అరుదైన ఘనత సాధించింది. అత్యంత వేగంగా ఈ రికార్డును సాధించడంపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. 

అన్నదాతల విజయోత్సాహం..

సాగు చట్టాలపై అన్నదాతల అలుపెరగని పోరాటం ఫలించింది. ఏడాది పాటు రైతులు సాగించిన ఉద్యమానికి దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. స్వయంగా ప్రధాని మోదీనే ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. జాతికి క్షమాపణ చెప్పడం గమనార్హం. ఈ ప్రకటన తర్వాత కూడా సాగు చట్టాలకు సంబంధించిన ఇతర అంశాలపై ప్రభుత్వంతో చర్చలు జరిపిన రైతన్నలు.. ఎట్టకేలకు డిసెంబరు 9న ఉద్యమానికి ముగింపు పలికారు. దేశ రాజధాని సరిహద్దులను ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని