Updated : 11 Sep 2021 10:25 IST

France: ఫ్రాన్స్‌లో ఒకప్పుడు రోజుకు 10 గంటలే!

(Photo: wikipedia)

ఇంటర్నెట్‌ డెస్క్‌: రోజుకు 24 గంటలు.. గంటకు 60 నిమిషాలు.. నిమిషానికి 60 సెకన్లు.. ఇది గడియారంలో సమయం లెక్క. ఎప్పటి నుంచో మనం దీన్నే పాటిస్తున్నాం. కానీ గతంలో ఫ్రాన్స్‌కు ఈ స్టాండర్డ్‌  టైం నచ్చలేదు. దీంతో దశాంశం(డెసిమల్‌) పద్ధతిలో రోజుకు 10 గంటలే ఉండేలా గడియారాన్ని మార్చేశారు. అయితే, ప్రజలు ఈ గడియారాన్ని అనుసరించి పనులు చేసుకోవడానికి విముఖత చూపారు. దీంతో మళ్లీ పాత పద్ధతిలో 24 గంటల గడియారాన్నే తీసుకొచ్చారు. 

ఫ్రాన్స్‌కు చెందిన కొంతమంది మేధావులు గతంలో ఈ స్టాండర్డ్‌ టైంను వ్యతిరేకించారు. 1754లో ఆ దేశ గణితశాస్త్రవేత్త జీన్‌ లె రాండ్‌ డి అలెంబర్ట్‌ సమయాన్ని పదితో విభజించేలా ఉండాలని ప్రతిపాదన చేశాడు. కానీ, అప్పుడు ఎవరూ దాన్ని అమలు చేసేందుకు ముందుకు రాలేదు. ఆ తర్వాత 1788లో క్లౌడే బోనిఫేస్‌ కొల్లిగాన్‌ అనే ఫ్రాన్స్‌ అటార్నీ గణితశాస్త్రవేత్త జీన్‌ ప్రతిపాదనతో ఏకీభవిస్తూ రోజుకు 10 గంటలు, గంటకు 100 నిమిషాలు, ఒక్క నిమిషానికి వెయ్యి సెకన్లు ఉండాలని ప్రతిపాదించాడు. అంతేకాదు.. వారానికి 10 రోజులు, ఏడాదికి 10 నెలలు ఉండేలా చేయాలన్నాడు. అయితే, బోనిఫేస్‌ ప్రతిపాదనకు మరో గణితశాస్త్రవేత్త జీన్‌ ఛార్లెస్‌ డి బోర్డా సవరణలు చేశాడు. 

అదే సమయంలో ఫ్రెంచ్‌ విప్లవం మొదలైంది. ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే సమయాన్ని సైతం మార్చాలని ఫ్రాన్స్‌ పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు డెసిమల్‌ పద్ధతిలో సమయాన్ని కొలవాలని పార్లమెంట్‌లో చట్టం చేశారు. అనంతరం పార్లమెంట్‌ ఆమోదంతో కొత్త సమయం 1793 నవంబర్‌ 24 అర్ధరాత్రి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం రోజుకు 10 గంటలు.. గంటకు 100 నిమిషాలు, నిమిషానికి 100 సెకన్లుగా గడియారం పనిచేస్తుంది. అంటే స్టాండర్డ్‌ గడియారంలో ఒక గంట.. డెసిమల్‌ విధానంలో 2.4గంటలతో, ఒక నిమిషం.. 1.44నిమిషాలతో సమానమవుతుంది. 0(అర్ధరాత్రి)తో రోజు ప్రారంభమై తిరిగి 0(10)తో ముగుస్తుంది. 5 గంటల సమయాన్ని మధ్యాహ్నంగా పరిగణిస్తారు.

అమలులో ఉన్నది 17 నెలలే..

ఈ కొత్త విధానంలో సమయాన్ని గుర్తించలేక ప్రజలు తికమకపడ్డారు. అందుకే జనాలు ఇబ్బంది పడకుండా అప్పటి గడియారం తయారీ సంస్థలు కొత్త సమయంతోపాటు 24 గంటలను సూచించే సంఖ్యలను కూడా పరికరంలో ఉంచేవారు. కాగా.. ప్రజలు కొత్త సమయానికి అలవాటుపడలేకపోయారు. డెసిమల్‌ పద్ధతిని పక్కన పెట్టి, పాత విధానంలోనే సమయాన్ని పాటించారు. బలవంతంగా ప్రజల ఇళ్లలోని గడియారాలు మార్చేద్దామంటే వాటి తయారీ, పంపిణీ ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఆ సాహసం చేయలేకపోయింది. 17 నెలలకే డెసిమల్‌ గడియారం మరుగునపడింది. దీంతో ఫ్రాన్స్‌ ప్రభుత్వం తిరిగి పాత 24 గంటల సమయాన్నే పాటించడం మొదలుపెట్టింది.

రోజుకు 1000 నిమిషాలతో స్విస్‌ గడియారం

1998 అక్టోబర్‌ 23న స్విట్జర్లాండ్‌కు చెందిన స్వాచ్‌ కంపెనీ ‘ఇంటర్నెట్‌ టైం’ పేరుతో కొత్త గడియారాన్ని విడుదల చేసింది. అందులో గంటలు ఉండవు. కేవలం నిమిషాలు మాత్రమే. రోజుకు వెయ్యి నిమిషాలు ఉంటాయి. అర్ధరాత్రి 000నిమిషాల వద్ద రోజు మొదలై 999 నిమిషాలకు ముగుస్తుంది. 500 నిమిషాల వద్ద మధ్యాహ్నం మొదలవుతుంది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని