కాడెద్దులకు ఒకరోజు సెలవు.. ఎక్కడో తెలుసా?

ప్రస్తుత కాలంలో పొలం పనులు చేయటానికి ట్రాక్టర్లను విరివిగా ఉపయోగిస్తున్నా, దుక్కి దున్నటంలో బీద రైతులకు దన్నుగా నిలుస్తున్నవి ఎద్దులే. అవి రైతన్నలకు నేస్తాలని చెబుతుంటారు. ఎందుకంటే అలుపెరుగకుండా పనిచేస్తాయి మరి. అందుకే వాటికీ వారంలో ఓ రోజు సెలవు నిద్దామనుకున్నారు ఆ ప్రాంతం ప్రజలు. 

Published : 19 Dec 2020 21:45 IST

కర్నూలు : ప్రస్తుత కాలంలో పొలం పనులు చేయటానికి ట్రాక్టర్లను విరివిగా ఉపయోగిస్తున్నా, దుక్కి దున్నటంలో బీద రైతులకు దన్నుగా నిలుస్తున్నవి ఎద్దులే. అవి రైతన్నలకు నేస్తాలని చెబుతుంటారు. ఎందుకంటే అలుపెరగకుండా పనిచేస్తాయి మరి. అందుకే వాటికీ వారంలో ఓ రోజు సెలవు నిద్దామనుకున్నారు ఆ ప్రాంతం ప్రజలు. అదేంటి ఎద్దులకు సెలవు ఇవ్వటేమేంటీ అని అనుకుంటున్నారా? అవును నిజమే. విశ్రాంతి లేకుండా పనిచేస్తే మనమే కాదు జంతువులూ అలసిపోతాయి. మనమైతే విశ్రాంతి తీసుకుంటాం మరి వాటికి అక్కర్లేదా చెప్పండి... మరి విధానం అనుసరిస్తున్న ఆ ప్రాంతం ఎక్కడుందో? వారు ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారో తెలుసుకుందామా? 

కర్నూలు జిల్లా హాలహర్వీ మండల పరిధిలోని విరుపాపురం, బలుగోట గ్రామాల్లో కాడెద్దులకు సోమవారం సెలవు ఇస్తారు. ఆ రోజు వాటితో ఎలాంటి పనులు చేయించరు. ఎంత అవసరం ఉన్నా సెలవు మాత్రం తప్పనిసరిగా ఇస్తారు. ఎద్దుల్ని ఇళ్లవద్దే కట్టేస్తారు. అంతేకాదు ఆరోజు ఉదయాన్నే ఎనిమిది గంటలలోపు వాటిని శుభ్రంగా కడిగి, బొట్లు పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం బలుగోటలోని బసవేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు.

ఎద్దులకు ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తినపుడు, కొత్త ఎద్దులు కొనుగోలు చేసినపుడు బలుగోట బసవేశ్వర స్వామి ఆలయంలో మొక్కులు చెల్లిస్తే సమస్యలు తీరుతాయని ఇక్కడి వారి నమ్మకం. ఈ ఆచారం కొన్ని వందల ఏళ్ల నుంచి కొనసాగుతోంది. దేవరగట్టులోని బసలింగయ్య స్వామిని ఆస్పరి స్వామిగా పిలుస్తారు. శివ స్వరూపం బసవన్న అవతారంలో ఉందనీ.. ఎద్దులకు తప్పకుండా సోమవారం సెలవు ఇవ్వాలన్న స్వామి సూచన మేరకు అనాదిగా గ్రామ పెద్దలు ఈ పద్ధతి పాటిస్తున్నారు. బలుగోట, విరుపాపురంలలో ఆరువందల కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడా నేటికీ కాడెద్దులతోనే వ్యవసాయం చేస్తారు. ఈ గ్రామాల్లో సుమారు నాలుగు వందల జతలకు పైగా కాడెద్దులు ఉన్నాయి.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని