ఎస్‌ఈసీ కార్యాలయానికి పంచాయతీరాజ్‌ అధికారులు

రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న వేళ.. పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది

Updated : 23 Jan 2021 15:01 IST

అమరావతి: రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న వేళ.. పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయంలోనే నిమ్మగడ్డ ఉన్నప్పటికీ అధికారులు ఆయన్ను కలవలేదు. నిమ్మగడ్డ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్‌కు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ తరఫున తీసుకొచ్చిన లేఖ ఇచ్చి అక్కడి నుంచి వెనుదిరిగారు. సీఎస్‌తో సమావేశం అనంతరం అధికారులు నేరుగా ఎస్‌ఈసీ కార్యాలయానికి వెళ్లారు.

హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసిన‌ నేపథ్యంలో న్యాయస్థానం నిర్ణయం వెలువడేవరకు వేచిచూడాలని.. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముగిసేవరకు నోటిఫికేషన్‌ వాయిదా వేయాలని ఎస్‌ఈసీని అధికారులు లేఖ ద్వారా కోరినట్లు సమాచారం. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నందున ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ సిద్ధంగా లేరని ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. 

ప్రభుత్వానికి పూర్తి గౌరవం ఉంది: లేఖలో సీఎస్‌

‘‘రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ దృష్ట్యా పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్‌ చేయండి. నోటిఫికేషన్‌కు ముందు ప్రభుత్వ సన్నద్ధతను ఎస్‌ఈసీ తెలుసుకోవాలి. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిబ్బందిని సమకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనిపై త్వరలో ఎస్‌ఈసీకి తెలియజేస్తాం. గత ఎన్నికల షెడ్యూల్‌ ప్రొసీడింగ్స్‌ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం పట్ల ప్రభుత్వానికి పూర్తి గౌరవం ఉంది. ఎన్నికల నిర్వహణపై ఉద్యోగ సంఘాల్లో భయాందోళన ఉంది. వ్యాక్సినేషన్‌ దృష్ట్యా ఉద్యోగులను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు సమయం పడుతుంది. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సినేషన్‌ తప్పనిసరి అని కేంద్రం నిర్దేశించింది. వ్యాక్సినేషన్‌, పోలింగ్‌ విధులు ఒకేసారి చేపట్టడం ఇబ్బందికర పరిణామం. ఎస్‌ఈసీ ప్రొసీడింగ్స్‌లో పేర్కొన్నట్లు అధికారుల బదిలీ కుదరదు. వ్యాక్సినేషన్‌ ముగిసిన 60 రోజుల తర్వాత నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని సీఎస్‌ తన లేఖలో పేర్కొన్నారు.

జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ముందుకు పిటిషన్‌

పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) సోమవారం విచారణకు రానుంది. జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ముందు పిటిషన్‌ విచారణ జరగనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను సోమవారం నాటి విచారణ జాబితాలో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ చేర్చింది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని