Telangana News: ఏఈఈ ఉద్యోగ నియామక పరీక్ష వాయిదా: టీఎస్‌పీఎస్సీ

అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టులకు నిర్వహించే నియామక పరీక్ష వాయిదా పడింది మార్చి 5న పరీక్ష నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.

Updated : 07 Jan 2023 20:05 IST

హైదరాబాద్‌: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. ఫిబ్రవరి 12న జరగాల్సిన పరీక్షను మార్చి 5కి వాయిదా వేసింది. ఫిబ్రవరి 12న గేట్‌ పరీక్ష ఉన్నందున ఏఈఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఈ పరీక్ష జరగనుంది. మొత్తం 837 ఉద్యోగాలకు 74,488 మంది దరఖాస్తు చేశారు.

మరోవైపు ఉద్యోగాలిప్పిస్తామంటూ కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసిందని.. అభ్యర్థులు డబ్బులిచ్చి మోసపోవద్దని టీఎస్‌పీఎస్సీ సూచించింది. నియామక ప్రక్రియ పారదర్శకంగా నిబంధనల మేరకే జరుగుతుందని వెల్లడించింది. నియామక ప్రక్రియపై నకిలీ ప్రకటనలు నమ్మొద్దని తెలిపింది. వాస్తవ సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని సూచించింది. మహిళ, శిశు సంక్షేమాధికారి నియామక పరీక్ష ప్రాథమిక ‘కీ’ని ఈనెల 10న విడుదల చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈనెల 11 నుంచి 15 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని