Gangavaram port: పోలీసులు-కార్మికుల మధ్య తోపులాట.. గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత

విశాఖపట్నం జిల్లా గంగవరం పోర్టు వద్ద కార్మికులు చేపట్టిన ‘పోర్టు బంద్‌’ ఉద్రిక్తతకు దారి తీసింది. కార్మికులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. 

Updated : 17 Aug 2023 12:02 IST

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా గంగవరం పోర్టు వద్ద కార్మికులు చేపట్టిన ‘పోర్టు బంద్‌’ ఉద్రిక్తతకు దారి తీసింది. కార్మికులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. 

తొలగించిన పోర్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు కనీస వేతనం రూ.36వేలు చెల్లించాలనే డిమాండ్లతో కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో గురువారం ఉదయం పెద్ద ఎత్తున కార్మికులు, నిర్వాసితులు, కాలుష్య ప్రభావిత ప్రాంతాల ప్రజలు, అఖిలపక్ష నేతలు గంగవరం పోర్టు వద్దకు చేరుకున్నారు. బంద్‌ పిలుపు నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. పోర్టు ప్రధాన ద్వారానికి 100 మీటర్ల దూరంలోని అదనపు గేటు వద్ద ఆందోళనకారులను అడ్డుకునేందుకు యత్నించారు. గేటుకు ఇరువైపులా భారీ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. 

పెద్ద ఎత్తున తరలివచ్చిన పోర్టు కార్మికులు కంచెను దాటుకుని తమ కుటుంబాలతో కలిసి ముట్టడికి యత్నించారు. దీంతో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు, పోలీసులకు గాయాలయ్యాయి. 10 మంది పోలీసులు గాయపడగా.. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తోపులాటలో గాజువాక సీఐ కాలిలో ముళ్ల కంచె దిగింది.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని