TSLPRB: దేహదారుఢ్య పరీక్షల్లో అనర్హులైన ఆ అభ్యర్థులకు మళ్లీ అవకాశం

దేహదారుఢ్య పరీక్షలో 1సెం.మీ ఎత్తుతో అనర్హత పొందిన వాళ్లకు గుడ్‌న్యూస్‌. ఆయా అభ్యర్థులకు మళ్లీ అవకాశం కల్పించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆ మేరకు ఏర్పాట్లు చేసింది.

Updated : 08 Feb 2023 20:15 IST

హైదరాబాద్‌: పోలీసు ఉద్యోగాల (TS police jobs) కోసం నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షల్లో ఒక సెంటీ మీటరు తక్కువ ఎత్తు (Height)తో అనర్హత పొందిన వాళ్లకు తిరిగి అవకాశం కల్పించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు (High court) ఆదేశాలతో ఆయా అభ్యర్థులకు తిరిగి మరోసారి ఎత్తును కొలవాలని పోలీస్ నియామక మండలి (TSLPRB) అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని అంబర్ పేట సీపీఎల్ మైదానం, కొండాపూర్‌లోని 8వ పోలీస్ బెటాలియన్ మైదానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 8 గంటల వరకు పోలీస్ నియామక మండలి వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. తిరిగి ఎత్తు కొలిచే ప్రక్రియలో అభ్యర్థులు దరఖాస్తు పత్రాలను తీసుకురావాలని అధికారులు చెప్పారు. 

ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పోలీస్ నియామక మండలి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిర్దేశించిన ఎత్తుకంటే 1 సెం.మీ తక్కువ ఎత్తు ఉన్న వాళ్లను అనర్హులుగా ప్రకటించారు. దీంతో ఆయా అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. సదరు అభ్యర్థుల ఎత్తును మరోసారి కొలవాలని హైకోర్టు ఆదేశించడంతో పోలీస్ నియామక మండలి ఆ మేరకు ఏర్పాట్లు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని